యువకుడి పొట్టలో 187 నాణాలు.. ఆపరేషన్ చేసి బయటకు తీసిన వైద్యులు

  • రెండు గంటలు కష్టపడాల్సి వచ్చిందన్న వైద్యులు
  • కర్ణాటకలో చోటుచేసుకున్న అసాధారణ ఘటన
  • యువకుడు మానసిక సమస్యతో బాధపడుతున్నాడని వైద్యుల వివరణ
  • బాధితుడు ప్రస్తుతం కోలుకుంటున్నాడని వెల్లడి
వాంతులు, పొత్తికడుపులో నొప్పిగా ఉందంటూ ఆసుపత్రికి వచ్చాడో యువకుడు.. అతడిని పరీక్షించిన వైద్యులు ఎక్స్ రే చూసి అవాక్కయ్యారు. ఆ యువకుడి కడుపులో నాణాలు కనిపించడమే దానికి కారణం. ఆపై ఆపరేషన్ చేసి అతని కడుపులో ఉన్న మొత్తం 187 నాణాలను బయటకు తీశారు. మానసిక వ్యాధితో బాధపడుతున్న సదరు యువకుడు కనిపించిన నాణాన్ని కనిపించినట్టే గుటుక్కుమనిపించాడట. కర్ణాటకలో తాజాగా వెలుగులోకి వచ్చిందీ అసాధారణ ఘటన.

కర్ణాటకలోని భాగల్ కోట్ జిల్లాకు చెందిన ఓ యువకుడు ఇటీవల వాంతులు, పొత్తికడుపులో నొప్పితో ఇబ్బంది పడుతున్నాడు. నొప్పి ఎంతకీ తగ్గకపోవడంతో కుటుంబ సభ్యులు హనగల్ లోని పెద్దాసుపత్రికి తీసుకెళ్లారు. పరీక్షించిన వైద్యులు అతడి పొట్టలో పెద్ద సంఖ్యలో నాణాలు ఉన్నాయని తేల్చారు. ఆపరేషన్ చేసి, రెండు గంటల పాటు కష్టపడి నాణాలన్నీ బయటకు తీశారు. వాటిని లెక్కించగా.. మొత్తం 187 నాణాలు ఉన్నాయని వైద్యులు చెప్పారు.

పొరపాటున ఒక్క నాణెం కడుపులోకి వెళితేనే ఇబ్బంది పడాల్సి వస్తుంది, అలాంటిది ఏకంగా 187 నాణాలు ఆ యువకుడి కడుపులోకి ఎలా వెళ్లాయని వైద్యులు ఆరా తీశారు. దీంతో సదరు యువకుడు మానసిక సమస్యతో బాధపడుతున్నాడని తేలిందని వివరించారు. ప్రస్తుతం బాధితుడు కోలుకుంటున్నాడని వైద్యులు పేర్కొన్నారు.


More Telugu News