బిగ్ బాస్ హౌస్ లో అసలైన పోరు మొదలైనట్టే!

  • 86 రోజులోకి అడుగుపెట్టిన 'బిగ్ బాస్'
  • 'టికెట్ టు ఫినాలే' కోసం ఆట మొదలు 
  • ఇంటి సభ్యుల మధ్య మరింత పెరిగిన పోటీ 
  • ఇనయా విషయంలో శ్రీహాన్ ను ఆటపట్టించిన శ్రీసత్య  
బిగ్ బాస్ హౌస్ లో 86వ రోజున అసలైన పోరు మొదలైపోయింది. ఇప్పటివరకూ ఇంటి సభ్యులు తమకి ఇచ్చిన టాస్కులను .. గేమ్స్ ను ఆడుతూ వచ్చారు. నిన్న మాత్రం 'టికెట్ టు ఫినాలే'కి సంబంధించిన ఆట మొదలైంది. ఈ ఆటలో గెలిచినవారు నేరుగా ఫైనల్స్ కి చేరుకునే అర్హతను పొందుతారు. అందువలన పోటీదారుల మధ్య నువ్వా? నేనా? అనే వాతావరణం కనిపించింది.

బిగ్ బాస్ ఓ 'స్నో మేన్' బొమ్మను తయారు చేసి దానిని హౌస్ లోకి పంపించారు. ఆ బొమ్మకు సంబంధించిన విడి భాగాలు హౌస్ లోకి వచ్చే పడేలా ఏర్పాటు చేశారు. ఎవరికి వారు ఆ భాగాలను సేకరించి ఒకదానికి ఒకటి అమర్చుతూ  'స్నో మేన్' రూపం తీసుకుని రావాలి. బజర్ మోగే సమయానికి ఎవరైతే తక్కువ విడిభాగాలను కలిగి ఉంటారో వారు 'టికెట్ టు ఫినాలే' రౌండ్ నుంచి తప్పుకుంటారు.దాంతో ఎవరికి వారు 'స్నో మేన్' విడి భాగాలను దక్కించుకోవడానికి పోటీపడ్డారు. ఒకరు సేకరించిన విడి భాగాలను మరొకరు బలవంతంగా లాక్కోవచ్చనే నియమం కూడా ఉండటంతో, శ్రీహాన్ దగ్గర నుంచి లాక్కోవడానికి ఇనయా ప్రయత్నించడం .. అతను అడ్డుకోవడం జరిగాయి. అయితే వాళ్లిద్దరూ పోట్లాడుకున్నట్టుగా లేదనీ, పాట పాడుకున్నట్టుగా ఉందంటూ శ్రీహాన్ ను శ్రీసత్య ఆటపట్టించిన తీరు నవ్వు తెప్పిస్తుంది. ఈ ఆట ముగిసే సమయానికి ఈ గేమ్ నుంచి శ్రీ సత్య .. ఇనయా .. కీర్తి తప్పుకున్నారు.


More Telugu News