రేపు ఐటీ విచారణకు మంత్రి మల్లారెడ్డి కుమారుడు, అల్లుడు హాజరు
- మెడికల్ సీట్లను అమ్ముకున్నారంటూ మల్లారెడ్డిపై ఆరోపణలు
- మంత్రి ఇల్లు, కార్యాలయాల్లో ఇదివరకే జరిగిన సోదాలు
- మంగళవారం రెండో రోజు కొనసాగిన ఐటీ అధికారుల విచారణ
తెలంగాణ మంత్రి మల్లారెడ్డి నివాసం, కార్యాలయాలపై ఆదాయపన్ను శాఖ దాడులు చేసిన సంగతి తెలిసిందే. మెడికల్ సీట్లను అక్రమంగా అమ్ముకున్నారంటూ వచ్చిన ఆరోపణలపై ఈ దాడులు జరగగా.... గడచిన రెండు రోజులుగా ఈ వ్యవహారంపై ఐటీ అధికారులు విచారణ సాగిస్తున్నారు. విచారణలో రెండో రోజైన మంగళవారం మల్లారెడ్డి విద్యా సంస్థలకు చెందిన ప్రిన్నిపల్ లు, డైరెక్టర్లు ఐటీ విచారణకు హాజరయ్యారు. ఈ సందర్భంగా మెడికల్ సీట్ల కేటాయింపుతో మొదలుపెట్టి.... ఆయా విద్యార్థులు చెల్లించిన ఫీజుల వివరాలపై అధికారులు ఆరా తీశారు.
మంగళవారం ఉదయం మొదలైన ఈ విచారణ సాయంత్రం దాకా కొనసాగింది. ఈ కేసులో రెండో రోజు విచారణ ముగిసిందని ఐటీ శాఖ ప్రకటించింది. మరోవైపు రేపు (బుధవారం) జరగనున్న మూడో రోజు విచారణకు మల్లారెడ్డి కుమారుడు భద్రారెడ్డితో పాటు మల్లారెడ్డి అల్లుడు మర్రి రాజశేఖర్ రెడ్డి కూడా హాజరు కానున్నారు. ఈ మేరకు వారిద్దరికీ ఇదివరకే ఐటీ అధికారులు నోటీసులు జారీ చేశారు. ఐటీ అధికారుల విచారణకు మల్లారెడ్డి కుమారుడు, అల్లుడు హాజరవుతున్న నేపథ్యంలో వారి నుంచి ఎలాంటి వివరాలు బయటకు వస్తాయోనన్న ఆసక్తి నెలకొంది.