షర్మిలను అరెస్ట్ చేయడం బాధాకరం: సజ్జల రామకృష్ణారెడ్డి

  • షర్మిలను అరెస్ట్ చేసిన హైదరాబాద్ పోలీసులు
  • వ్యక్తిగతంగా షర్మిల అరెస్ట్ బాధాకరమన్న సజ్జల
  • షర్మిల పార్టీ తెలంగాణలోనే ఉందని వ్యాఖ్య
  • వైఎస్సార్టీపీ రాజకీయ నిర్ణయాల్లో జోక్యం చేసుకోబోమని వెల్లడి
టీఆర్ఎస్ శ్రేణుల దాడిలో ధ్వంసమైన తన కారుతో ప్రగతి భవన్ కు వెళ్లేందుకు యత్నించిన వైఎస్సార్టీపీ అధినేత్రి వైఎస్ షర్మిలను హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ట్రాఫిక్ కు అంతరాయం కలిగించారంటూ ఆమెపై పోలీసులు కేసు కూడా నమోదు చేశారు. ఈ క్రమంలో షర్మిల అరెస్ట్ పై వైసీపీ ప్రధాన కార్యదర్శి, ఏపీ ప్రభుత్వ ముఖ్య సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి స్పందించారు. షర్మిలను ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ కు తరలించిన విషయం తెలుసుకున్న వెంటనే... షర్మిల ఇంకా పోలీస్ స్టేషన్ లో ఉండగానే... సజ్జల స్పందించడం విశేషం.

దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి కుమార్తెగా, సీఎం జగన్ మోహన్ రెడ్డి సోదరిగా ఉన్న షర్మిలను ఈ తరహాలో అరెస్ట్ చేయడం బాధ కలిగించే అంశమేనని సజ్జల అన్నారు. వ్యక్తిగతంగా షర్మిల అరెస్ట్ తమకు బాధ కలిగించిందని ఆయన అన్నారు. షర్మిల అరెస్ట్ ను ఆయన దురదృష్టకర ఘటనగా అభివర్ణించారు. 

షర్మిల అరెస్ట్ పై మీ స్పందన ఏమిటన్న మీడియా ప్రతినిధుల ప్రశ్నకు ఆయన పై విధంగా స్పందించారు. తమది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అన్న సజ్జల... షర్మిలది వైఎస్సార్ తెలంగాణ పార్టీ అని తెలిపారు. షర్మిల పార్టీ తెలంగాణలో ఉందని పేర్కొన్నారు. షర్మిల రాజకీయ నిర్ణయాల్లో మాత్రం జోక్యం చేసుకోమని కూడా సజ్జల తేల్చి చెప్పారు.


More Telugu News