షర్మిలపై కేసు నమోదు చేసిన పంజాగుట్ట పోలీసులు

  • వరంగల్ జిల్లాలో షర్మిల పాదయాత్రను అడ్డుకున్న టీఆర్ఎస్ శ్రేణులు
  • దాడిలో ధ్వంసమైన కారులో ప్రగతి భవన్ కు బయలుదేరిన షర్మిల
  • పంజాగుట్ట వద్ద షర్మిలను అడ్డుకున్న పోలీసులు
  • కారులో షర్మిలను క్రేన్ తో ఎస్ఆర్ నగర్ పీఎస్ కు తరలింపు
  • ట్రాఫిక్ కు అంతరాయం కలిగించారంటూ 3 సెక్షన్ల కింద షర్మిలపై కేసు నమోదు
వైఎస్సార్టీపీ అధినేత్రి వైఎస్ షర్మిలపై తెలంగాణ పోలీసులు కేసు నమోదు చేశారు. పాదయాత్రలో భాగంగా సోమవారం వరంగల్ జిల్లా చెన్నారావుపేట వద్ద టీఆర్ఎస్ కార్యకర్తల నుంచి షర్మిలకు తీవ్ర ప్రతిఘటన ఎదురైన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో షర్మిలపై టీఆర్ఎస్ కార్యకర్తలు దాడికి యత్నించారు. ఈ దాడిలో షర్మిల కారు పాక్షికంగా ధ్వంసమైంది. 

నిన్న టీఆర్ఎస్ కార్యకర్తల దాడిలో ధ్వంసమైన తన కారులోనే నేడు ప్రగతి భవన్ కు వెళ్లేందుకు షర్మిల బయలుదేరారు. ఈ విషయాన్ని పసిగట్టిన పోలీసులు పంజాగుట్ట వద్ద ఆమెను నిలిపివేశారు. అయితే పోలీసుల వినతిని తిరస్కరించిన షర్మిల... కారులో నుంచి దిగేందుకు నిరాకరించడంతో షర్మిల కారును పోలీసులు క్రేన్ సహాయంతో ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. 

అనంతరం ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ వద్ద కూడా కారు దిగేందుకు షర్మిల నిరాకరించడంతో పోలీసులు బలవంతంగా కారు డోర్లను బద్దలు కొట్టి మరీ షర్మిలను అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత ఆమెను పోలీస్ స్టేషన్ లోకి తీసుకెళ్లారు. ఈ సందర్భంగా షర్మిలపై పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో పోలీసులు ఓ కేసు నమోదు చేశారు. ట్రాఫిక్ కు అంతరాయం కలిగించారన్న ఆరోపణల కింద ఐపీసీ 353, 333, 337 సెక్షన్ల కింద ఈ కేసు నమోదు అయ్యింది. మొత్తంగా పంజాగుట్ట నుంచి ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ దాకా షర్మిలను తరలిస్తున్న క్రమంలో హైడ్రామా నెలకొంది.


More Telugu News