వివేకా హత్య కేసు హైదరాబాదుకు బదిలీ నేపథ్యంలో... సీఎం జగన్ పై టీడీపీ నేతల విమర్శలు

  • వివేకా హత్య కేసులో సుప్రీం కీలక ఆదేశాలు
  • విచారణ హైదరాబాదు సీబీఐ కోర్టుకు బదిలీ
  • సీఎం రాజీనామా చేయాలన్న చంద్రబాబు
  • ప్రభుత్వ ప్రతిష్ఠకు మాయనిమచ్చ అంటూ అచ్చెన్న వ్యాఖ్యలు
  • అబ్బాయ్ ఇక చంచల్ గూడ జైలుకి అంటూ లోకేశ్ వ్యంగ్యం
మాజీ ఎంపీ వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు విచారణను సుప్రీంకోర్టు హైదరాబాదు సీబీఐ కోర్టుకు బదిలీ చేస్తూ కీలక తీర్పు ఇవ్వడం తెలిసిందే. ఈ నేపథ్యంలో టీడీపీ నేతలు ఏపీ సీఎం జగన్ ను లక్ష్యంగా చేసుకుని విమర్శనాస్త్రాలు సంధించారు. 

టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు స్పందిస్తూ, సొంత బాబాయ్ హత్య కేసు విచారణ పొరుగు రాష్ట్రానికి బదిలీ... అది కూడా నువ్వు సీఎంగా ఉండగా! తలెక్కడ పెట్టుకుంటావు జగన్ రెడ్డీ? అని ప్రశ్నించారు. అబ్బాయి కిల్డ్ బాబాయ్.... జగన్ రాజీనామా చేయాల్సిందే అంటూ చంద్రబాబు హ్యాష్ ట్యాగ్ లు కూడా పెట్టారు. 

టీడీపీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు కూడా స్పందించారు. బాబాయ్ హత్య కేసు విచారణ ఏపీ నుంచి తెలంగాణకు బదిలీ కావడం ప్రభుత్వ ప్రతిష్ఠకు, పోలీస్ శాఖకు మాయని మచ్చ అని విమర్శించారు. తనలో ఏ మాత్రం నైతికత మిగిలున్నా జగన్ తక్షణమే తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. జగన్ ఒక విఫల ముఖ్యమంత్రి అని పేర్కొన్నారు. 

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ స్పందిస్తూ, "బాబాయ్ హత్య కేసు పక్క రాష్ట్రానికి, అబ్బాయ్ చంచల్ గూడ జైలుకి" అంటూ వ్యంగ్యం ప్రదర్శించారు.

అటు, టీడీపీ సీనియర్ నేత బొండా ఉమ ఈ అంశంపై ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి మరీ విమర్శించారు. బాబాయ్ ని చంపినవారిని కాపాడాలన్న జగన్ రెడ్డి విఫలయత్నాలు సుప్రీంకోర్టు తీర్పుతో బట్టబయలు అయ్యాయని విమర్శించారు. ఈ  కేసు విచారణలో “న్యాయం జరుగుగుతుందని ప్రచారం చేయడం కాదు, న్యాయం జరిగినట్టు కనబడాలి” అన్న అత్యున్నత న్యాయస్థానం వ్యాఖ్యలు ముమ్మాటికీ జగన్ రెడ్డికి, ఆయన ప్రభుత్వానికి గొడ్డలిపెట్టు లాంటివేనని అన్నారు. 

బాబాయ్ హత్యకేసులో ఆధారాలు, సాక్ష్యాలు రూపుమాపిన అవినాశ్ రెడ్డి, అతని బృందాన్ని కాపాడుతున్న జగన్ రెడ్డికి రాష్ట్రాన్ని పాలించే హక్కులేదని బొండా ఉమ పేర్కొన్నారు. వివేకా హత్యకేసుపై తన చెల్లి షర్మిల వ్యాఖ్యలపై జగన్ ఏం సమాధానం చెబుతాడు? వివేకా మర్డర్ కేసులో జగన్ రెడ్డి కుటుంబం పాత్ర ఉందని తాము మొదటి నుంచి చెబుతూనే ఉన్నామని ఉమ అన్నారు. కడప ఎంపీ సీటు విషయంలో తలెత్తిన వివాదమే వివేకా హత్యకు కారణమని ఆయన ఆరోపించారు.


More Telugu News