గ్రేటర్ పరిధిలో వెయ్యి కొత్త బస్సులు: టీఎస్ ఆర్టీసీ

  • సిటీ బస్సులతో పాటు సూపర్ లగ్జరీ బస్సులు కూడా కొనుగోలు
  • పల్లె వెలుగు, ఎక్స్ ప్రెస్ బస్సుల్లో స్టూడెంట్ పాస్ లకు అనుమతి
  • గ్రేటర్ పరిధిలో అనుమతించాలని టీఎస్ ఆర్టీసీ అధికారుల నిర్ణయం
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని డొక్కు బస్సులను తుక్కుగా మార్చేసి, కొత్త బస్సులను అందుబాటులోకి తీసుకురావాలని తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(టీఎస్ ఆర్టీసీ) నిర్ణయించింది. ఇందులో భాగంగా పాతబడిపోయిన 720 బస్సులను స్క్రాప్ గా మార్చేయనున్నట్లు తెలిపింది. వాటి స్థానంలో 1020 కొత్త బస్సులను తిప్పనున్నట్లు వెల్లడించింది. కొత్త వాటిలో సిటీ బస్సులతో పాటు సూపర్ లగ్జరీ, ఎలక్ట్రిక్ బస్సులు కూడా ఉంటాయని అధికారులు వివరించారు. బస్సుల కొనుగోలుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని వెల్లడించారు.

దూరప్రాంతాల నుంచి హైదరాబాద్ కు రాకపోకలు సాగించే పల్లెవెలుగు, ఎక్స్ ప్రెస్ బస్సుల్లోనూ విద్యార్థుల పాస్ లను అనుమతించనున్నట్లు ఆర్టీసీ ఉన్నతాధికారులు పేర్కొన్నారు. గ్రేటర్ పరిధిలో విద్యార్థులకు ఈ అవకాశం కల్పించనున్నట్లు తెలిపారు. నగరంలోని వివిధ ప్రాంతాలకు చెందిన విద్యార్థులు శివార్లలోని కళాశాలలు, ఇతర విద్యా సంస్థల్లో చదువుతున్నారు. అక్కడి వరకూ తిరిగే సిటీ బస్సుల సంఖ్య పరిమితంగానే ఉంది. 

అదే సమయంలో ఆయా విద్యాసంస్థలకు చెందిన విద్యార్థుల బస్ పాస్ కేవలం సిటీ బస్సుల్లోనే చెల్లుబాటు అవుతుంది. దీంతో విద్యార్థులు అవస్థలు పడడాన్ని గుర్తించి ఆ రూట్లలో తిరిగే పల్లె వెలుగు, ఎక్స్ ప్రెస్ బస్సుల్లోనూ విద్యార్థుల పాస్ చెల్లుబాటయ్యేలా తాజాగా ఆదేశాలు జారీ చేసినట్లు అధికారులు తెలిపారు.


More Telugu News