ర్యాగింగ్‌కు భయపడి.. రెండో అంతస్తు నుంచి దూకిన దిబ్రూగఢ్ యూనివర్సిటీ విద్యార్థి

  • విషమంగా విద్యార్థి పరిస్థితి
  • మాజీ విద్యార్థి సహా ఐదుగురి అరెస్ట్
  • నాలుగు నెలలుగా వేధిస్తున్న సీనియర్లు
  • ఆసుపత్రిలో చికిత్స.. పరిస్థితి విషమం  
యూనివర్సిటీలో ర్యాగింగ్ భూతం ఓ విద్యార్థి ప్రాణాల మీదకు తెచ్చింది. అసోంలోని దిబ్రూగఢ్ యూనివర్సిటీలో జరిగిందీ ఘటన. సీనియర్ విద్యార్థుల ర్యాగింగ్‌కు భయపడిన ఆనంద్ శర్మ అనే విద్యార్థి సీనియర్ల బారి నుంచి తప్పించుకునేందుకు హాస్టల్ భవనంలోని రెండో అంతస్తు నుంచి కిందికి దూకేశాడు. ఈ ఘటనలో తీవ్ర గాయాలపాలైన ఆనంద్‌ను వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అతడి పరిస్థితి విషమంగా ఉన్నట్టు వైద్యులు తెలిపారు. ఆనంద్‌ను ర్యాగింగ్ చేసినట్టుగా భావిస్తున్న ఐదుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. 

రాత్రి నుంచి తెల్లవారుజాము వరకు వేధింపులే..
ఆనంద్ శర్మ తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. సీనియర్ విద్యార్థులు తన కుమారుడిని నాలుగు నెలలుగా శారీరకంగా, మానసికంగా వేధించేవారని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో ఆమె పేర్కొన్నారు. తన కుమారుడి నుంచి డబ్బులు, మొబైల్ లాక్కుని హింసించేవారని, మద్యం తాగించి అభ్యంతరకరమైన ఫొటోలు తీసేవారని, ఆపై వాటిని సోషల్ మీడియాలో పెడతామని బెదిరించే వారని ఆరోపించారు. ఆనంద్ తనకు ఫోన్ చేసి హాస్టల్‌కు వెళ్తున్నానని, సీనియర్ విద్యార్థులు రాత్రంతా తనను వేధిస్తున్నారని పేర్కొన్నాడని చెప్పారు. వారి ర్యాగింగ్ కారణంగా తన కుమారుడి కాలు విరిగిందని, ఛాతీపై గాయమైందన్నారు.

ర్యాగింగ్‌కు నో చెప్పండి
దిబ్రూగఢ్ యూనివర్సిటీలో కలకలం రేపిన ర్యాగింగ్ ఘటనపై ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ స్పందించారు. నిందితులను వదిలిపెట్టబోమన్న సీఎం.. బాధిత విద్యార్థికి చికిత్స కొనసాగుతున్నట్టు పేర్కొన్నారు. ర్యాగింగ్‌కు దూరంగా ఉండాలని విద్యార్థులను కోరారు. కాగా, ఆనంద్‌శర్మతో పాటు ర్యాగింగ్ బాధితులు మరో ఇద్దరు ఉన్నట్టు తెలుస్తోంది.

నిందితుల్లో మాజీ విద్యార్థి
పోలీసులు అరెస్ట్ చేసిన నిందితుల్లో రాహుల్ చెత్రీ అనే మాజీ విద్యార్థి కూడా ఉన్నాడు. నేరపూరిత కుట్ర, ఓ వ్యక్తిని అన్యాయంగా అడ్డుకోవడం, దోపిడీకి పాల్పడడం, హత్యాయత్నం, చట్టవిరుద్ధంగా సమావేశం కావడం వంటి సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ర్యాగింగ్‌పై ఆనంద్ శర్మ యూనివర్సిటీ హాస్టల్ అధికారులకు ఈ  నెల 17న లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేసినట్టు తెలుస్తోంది. ఆ లేఖలో తనను ర్యాగింగ్ చేస్తున్న వారి పేర్లను కూడా పేర్కొన్నట్టు సహచర విద్యార్థులు తెలిపారు.


More Telugu News