ఎన్నడా పంత్... ఇదేం ఆటతీరు?: కృష్ణమాచారి శ్రీకాంత్

  • వరుసగా విఫలమవుతున్న రిషబ్ పంత్
  • జట్టులో చోటు ప్రశ్నార్థకం
  • పంత్ కు విరామం ఇవ్వాలన్న శ్రీకాంత్ 
  • తన ఆటతీరును సమీక్షించుకునే అవకాశం కల్పించాలని వెల్లడి
ఒకప్పుడు తన విధ్వంసక బ్యాటింగ్ తో టీమిండియాలో నమ్మదగిన ఆటగాడిగా కొనసాగిన వికెట్ కీపర్ రిషబ్ పంత్ ఇప్పుడు వరుస వైఫల్యాలతో సతమతమవుతున్నాడు. జట్టులో తన స్థానమే ప్రశ్నార్థకం అనేలా అతడి ఆటతీరు ఉంది. అనేక అవకాశాలు ఇస్తున్నప్పటికీ పంత్ ఆటతీరులో మార్పు రావడంలేదు. దాంతో అతడిపై విమర్శకుల దృష్టి పడింది. 

ఈ ఎడమచేతివాటం ఆటగాడి ఫామ్ లేమిపై భారత క్రికెట్ దిగ్గజం కృష్ణమాచారి శ్రీకాంత్ స్పందించారు. "ఎన్నడా పంత్... ఇదేం ఆటతీరు!" అంటూ తమిళంలో వ్యాఖ్యానించారు. పంత్ తనకొచ్చిన అవకాశాలను వృథా చేస్తున్నాడని, అతడి ప్రదర్శన తనకు చాలా నిరాశ కలిగించిందని చెప్పారు. ప్రతి మ్యాచ్ లోనూ విఫలమవుతున్న పంత్ తన పరిస్థితిని మరింత గందరగోళంగా మార్చుకుంటున్నాడని అన్నారు. పంత్ కు అంతర్జాతీయ క్రికెట్ నుంచి విరామం ఇవ్వాలని, తద్వారా తన ఆటతీరును పునరుద్ధరించుకునేందుకు అవకాశం కల్పించాలని సూచించారు. 

ఈ ఏడాది టీ20ల్లో పంత్ కేవలం ఒక్క అర్ధసెంచరీ మాత్రమే సాధించాడు. అది కూడా బలహీనమైన వెస్టిండీస్ పై నమోదు చేశాడు. 2022లో ఇప్పటిదాకా పంత్ 21 ఇన్నింగ్స్ లు ఆడితే అందులో 30కి పైబడి పరుగులు చేసింది కేవలం రెండుసార్లే. వన్డేల్లో కాస్తంత మెరుగనే చెప్పాలి. ఈ ఏడాది 9 ఇన్నింగ్స్ ల్లో రెండు ఫిఫ్టీలు, ఒక శతకం సాధించాడు. 

ఈ నేపథ్యంలో, తన సొంత యూట్యూబ్ చానల్ 'చీకీ చీకా'లో కృష్ణమాచారి శ్రీకాంత్ మాట్లాడుతూ, "టీమిండియాలో పంత్ పరిస్థితిని పెద్దగా పట్టించుకుంటున్నట్టులేదు. పంత్ కు విశ్రాంతి ఇవ్వాల్సిన తరుణం ఇదే. కొద్దిగా విరామం తీసుకో అని అతడికి చెప్పాలి. భారత్ లో దేశవాళీ క్రికెట్ ఆడాలని అతడికి సూచించాలి" అని వివరించారు.


More Telugu News