అమరావతిపై హైకోర్టు ఉత్తర్వులపై పాక్షికంగా స్టే విధించిన సుప్రీంకోర్టు.. కీలక వ్యాఖ్యలు!

  • అమరావతిపై నేడు సుప్రీంకోర్టులో విచారణ
  • హైకోర్టు ఉత్తర్వులపై పూర్తిస్థాయి స్టేకు సుప్రీం నిరాకరణ
  • కాలపరిమితి అంశంలో హైకోర్టు ఉత్తర్వులపై సుప్రీం స్టే
  • తదుపరి విచారణ జనవరి 31కి వాయిదా
అమరావతిపై నేడు సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. అమరావతిపై గతంలో హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై పూర్తిస్థాయి స్టే ఇచ్చేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. అయితే, నెల రోజుల్లో కొన్ని పనులు, మరో 6 నెలల్లో ఇంకొన్ని పనులు చేయాలన్న కాలపరిమితులపై సుప్రీంకోర్టు స్టే ఇచ్చింది. అనంతరం తదుపరి విచారణను వచ్చే ఏడాది జనవరి 31కి వాయిదా వేసింది. అమరావతి వ్యవహారానికి సంబంధించి ప్రతివాదులందరికీ నోటీసులు జారీ చేసింది. జనవరి 31 లోపు తప్పనిసరిగా జవాబు దాఖలు చేయాలని అత్యున్నత న్యాయస్థానం ఆదేశించింది.

అమరావతి అంశంలో వేర్వేరుగా దాఖలైన పిటిషన్లపై నేడు విచారణ జరిగింది. అమరావతినే రాజధానిగా కొనసాగించాలన్న హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ ఏపీ రాష్ట్ర ప్రభుత్వం పిటిషన్ దాఖలు చేయగా, తీర్పులో మరికొన్ని అంశాలు చేర్చాలని రాజధాని రైతు పరిరక్షణ సమితి కూడా సుప్రీం కోర్టును ఆశ్రయించింది. రాష్ట్ర ప్రభుత్వం, రైతుల తరఫున అత్యున్నత న్యాయస్థానంలో దాదాపు గంటన్నర పాటు వాదనలు కొనసాగాయి.

  విచారణ ముఖ్యాంశాలు...

  • ఆరు నెలల్లో అమరావతిని అభివృద్ధి చేయాలని గత మార్చిలో హైకోర్టు ఇచ్చిన తీర్పుపై నేడు సుప్రీంకోర్టు స్టే
  • విచారణ జరిపిన జస్టిస్ కేఎం జోసెఫ్, జస్టిస్ నాగరత్న ధర్మాసనం
  • కోర్టులు టౌన్ ప్లానర్లు, చీఫ్ ఇంజినీర్లుగా మారితే ఎలా? అంటూ హైకోర్టుకు సుప్రీం ధర్మాసనం చురకలు
  • ఏపీలో అధికార విభజన జరగడంలేదు కదా... అలాంటప్పుడు హైకోర్టు ఓ కార్యనిర్వాహణాధికారిగా ఎలా వ్యవహరిస్తుందని ప్రశ్నించిన ధర్మాసనం
  • ఈ కేసులో న్యాయపరమైన సవాళ్లను జనవరి 31న విచారిస్తామని వెల్లడి



More Telugu News