రక్తంలో గ్లూకోజ్ కట్టడికి.. ఇవి సహజసిద్ధ పరిష్కారాలు

  • మెంతులు మంచి పరిష్కారం
  • ఉసిరి, త్రిఫల, గుడూచి వాడుకోవచ్చు
  • పెరట్లో ఉండే వేపతోనూ ఎన్నో ప్రయోజనాలు
  • వీటిని నిత్య జీవితంలో భాగం చేసుకోవడం వల్ల నియంత్రణలో షుగర్
రక్తంలో గ్లూకోజ్ స్థాయులు విపరీతంగా పెరగడం ఏ మాత్రం మంచిది కాదు. ఇలా కొంత కాలం పాటు నియంత్రణలో లేకుండా అధిక గ్లూకోజ్ పరిమాణం రక్తంలో కొనసాగితే అది మధుమేహానికి దారితీస్తుంది. మధుమేహం వచ్చిన తర్వాత తినే ఆహారం వారి ఆరోగ్యంలో కీలక పాత్ర పోషిస్తుంటుంది. రక్తంలో గ్లూకోజ్ కట్టడి చేయకపోతే, అది వ్యాధి నిరోధక శక్తిని దెబ్బతీస్తుంది. నాడీ సంబంధిత, రక్త ప్రసరణ వ్యవస్థపై ప్రభావం పడుతుంది. అందుకని రక్తంలో గ్లూకోజ్ ను నియంత్రణలో ఉంచుకోవాలి. ఇందుకు కొన్ని సహజ సిద్ధ మార్గాలు ఎన్నో ఉన్నాయి. 

మెంతులు
మెంతులకు ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయనేది కొత్త విషయం కాదు. ప్రకృతి చికిత్సలో మెంతులకు (ఫెనుగ్రీక్) ఎంతో ముఖ్య స్థానం ఉంటుంది. ముఖ్యంగా మధుమేహం సమస్య ఉన్న వారికి మెంతులు మంచి ఔషధమనే చెప్పుకోవాలి. వీటిల్లో ముసిలాజినోస్ ఫైబర్, అమైనో యాసిడ్స్, సపోనిన్స్, అల్కలాయిడ్స్ ఉంటాయి. మెంతి గింజల్లో సగం ఫైబరే ఉంటుంది. ఫైబర్ అధికంగా ఉండే వీటితో రక్తంలో గ్లూకోజ్ తగ్గిపోతుంది. ఎందుకంటే మెంతుల్లో ఉండే ఫైబర్ శరీరం కార్బోహైడ్రేట్స్ ను గ్రహించడాన్ని నిదానింపజేస్తుంది.

గిలోయ్ 
దీన్నే గుడూచి అని కూడా అంటారు. రక్తంలో అదనంగా ఉన్న గ్లూకోజ్ ను ఇది తొలగిస్తుంది. దీంతో బ్లడ్ షుగర్ స్థాయులు సాధారణంగా మారతాయి.

త్రిఫల
త్రిఫలతో ఎన్నో ఉపయోగాలున్నాయి. శరీరంలో దోషాలను హరిస్తుంది. జీర్ణ వ్యవస్థ ఆరోగ్యానికి సాయపడుతుంది. విరేచనం సాఫీ అయ్యేందుకు అనుకూలిస్తుంది. అంతేకాదు బ్లడ్ గ్లూకోజ్ స్థాయులను కూడా తగ్గిస్తుంది. ఇన్సులిన్ ను ఉత్పత్తి చేసే పాంక్రియాస్ కు ప్రేరణనిస్తుంది.

వేప
వేపాకులు కూడా రక్తంలో షుగర్ నియంత్రణకు సాయపడతాయి. వేప ఆకులను నలిపి నీటిలో వేసి మరగబెట్టి డికాషన్ చేసుకోవాలి. ఈ డికాషన్ ను రోజూ ఒకసారి తాగాలి. 

ఉసిరి
దీన్నే ఇండియన్ గూస్ బెర్రీ, ఆమ్ల అంటారు. ఇందులో విటమిన్ సీ పుష్కలం. యాంటీ ఆక్సిడెంట్లలో ఇది ఒకటి. శరీరంలోకి చేరిన హానికారకాలపై గట్టిగా పోరాడుతుంది. రక్తంలో షుగర్ ను గణనీయంగా తగ్గిస్తున్నట్టు పరిశోధకులు తెలుసుకున్నారు.


More Telugu News