సరస్సులో ఈతకు దిగి.. అమెరికాలో ఇద్దరు తెలంగాణ విద్యార్థుల మృతి

  • ఇద్దరూ మంచి స్నేహితులని కుటుంబ సభ్యుల వెల్లడి
  • ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లారని పేర్కొన్న బంధువులు
  • వారాంతంలో పార్టీ.. సరస్సులో ఈత కొడుతూ గల్లంతు
  • డెడ్ బాడీలను వెలికి తీసిన పెట్రోలింగ్ పోలీసులు
ఉన్నత విద్యకోసం అమెరికా వెళ్లిన తెలంగాణ విద్యార్థులు ప్రమాదవశాత్తూ ప్రాణాలు కోల్పోయారు. చనిపోయిన ఇద్దరు యువకులు మంచి స్నేహితులని వాళ్ల కుటుంబ సభ్యులు తెలిపారు. వికారాబాద్‌ జిల్లా తాండూరుకు చెందిన శివదత్త, నక్కలగుట్టకు చెందిన ఉత్తేజ్‌ పై చదువుల కోసం కొన్నినెలల క్రితమే అమెరికా వెళ్లారు. సెయింట్‌ లూయిస్‌ యూనివర్సిటీలో ఇద్దరూ ఎంఎస్‌ చదువుతున్నారు. వీకెండ్ సందర్భంగా శనివారం మధ్యాహ్నం స్నేహితులతో కలిసి పార్టీ చేసుకున్నారు. ఆపై అక్కడే ఉన్న సరస్సులో ఈత కొట్టేందుకు దిగారు. చలి బాగా ఎక్కువగా ఉండడంతో మిగతా వారు బయటకు రాగా.. శివదత్త, ఉత్తేజ్ మాత్రం సరస్సులో గల్లంతయ్యారు. 

ఒడ్డుకు చేరిన స్నేహితుల సమాచారంతో అక్కడికి చేరుకున్న పెట్రోలింగ్ పోలీసులు సరస్సులో నుంచి శివదత్త మృతదేహాన్ని వెలికితీశారు. ఉత్తేజ్ కోసం చాలాసేపు గాలించినా.. ఆదివారం రాత్రికి కానీ మృతదేహం లభించలేదు. శివదత్త, ఉత్తేజ్ ల మరణ వార్త తెలిసి వారి కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. తమ కుమారుల మృతదేహాలను దేశానికి తీసుకువచ్చేందుకు సాయం చేయాలంటూ మంత్రి కేటీఆర్, సబితారెడ్డి, ఎమ్మెల్యే రోహిత్ రెడ్డిలకు విజ్ఞప్తి చేశారు.


More Telugu News