రైల్వే ప్రయాణికుడు ఇచ్చిన రూ. 500 నోటును రూ. 20గా చూపించి ఏమార్చే యత్నం చేసిన బుకింగ్ క్లర్క్ .. వీడియో వైరల్

  • ఢిల్లీలోని హజ్రత్ నిజాముద్దీన్ రైల్వే స్టేషన్‌లో ఘటన
  • రూ. 500 నోటు ఇచ్చి గ్వాలియర్‌కు టికెట్ అడిగిన ప్రయాణికుడు
  • దానిని రూ. 20 నోటుగా చూపిస్తూ మరో రూ. 125 అడిగిన క్లర్క్
  • వీడియో వైరల్ కావడంతో స్పందించిన రైల్వే మంత్రి
  • టికెట్ క్లర్క్‌పై క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని స్పష్టీకరణ
రైల్వే టికెట్ కౌంటర్‌లోని ఓ ఉద్యోగి ప్రయాణికుడు ఇచ్చిన రూ. 500 నోటును క్షణాల్లో రూ. 20 నోటుగా మార్చేశాడు. ప్రయాణికుడిని మోసం చేసి డబ్బులు కొట్టేయాలన్న అతడి పన్నాగాన్ని ఓ వీడియో బయటపెట్టింది. ఢిల్లీలోని హజ్రత్ నిజాముద్దీన్ రైల్వే స్టేషన్‌లో జరిగిందీ ఘటన. టికెట్ కౌంటర్‌ వద్దకు వచ్చిన ఓ ప్రయాణికుడు గ్వాలియర్ వెళ్లేందుకు సూపర్ ఫాస్ట్ రైలుకు టికెట్ అడుగుతూ రూ. 500 నోటు అందించాడు. అతడి చేతిలో రూ. 500 నోటు ఉండడాన్ని గమనించిన టికెట్ క్లర్క్ నగదు కౌంటర్ నుంచి రూ. 20 తీసి చేతిలో పట్టుకుని సిద్ధంగా ఉంచుకోవడం వీడియోలో కనిపిస్తోంది.

ఆ తర్వాత ప్రయాణికుడు ఇచ్చిన రూ. 500 నోటును తీసుకుని అతడిని మాటల్లో పెట్టి రూ. 500 నోటు స్థానంలో రూ. 20 పెట్టి ఏమార్చే ప్రయత్నం చేశాడు. గ్వాలియర్‌‌ టికెట్‌కు ఇది సరిపోదని, మరో రూ. 125 ఇవ్వాలని అడిగాడు. అతడి మాటలు విని ప్రయాణికుడు విస్తుపోయాడు. గత మంగళవారం జరిగిన ఈ ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. 

ఇందుకు సంబంధించిన వీడియోను ‘రైల్ విష్పర్స్’ అనే ట్విట్టర్ హ్యాండిల్ షేర్ చేసింది. ఈ వీడియో కాస్తా వైరల్ కావడంతో రైల్వే ఉన్నతాధికారులు, రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ స్పందించారు. ప్రయాణికుడిని మోసం చేసిన టికెట్ బుకింగ్ క్లర్క్‌పై క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని ట్విట్టర్ ద్వారా తెలిపారు.


More Telugu News