పట్టపగలు అందరూ చూస్తుండగానే.. సెల్ టవర్‌ను లేపేసిన దొంగల ముఠా!

పట్టపగలు అందరూ చూస్తుండగానే.. సెల్ టవర్‌ను లేపేసిన దొంగల ముఠా!
  • రూ. 19 లక్షల విలువైన సెల్ టవర్‌ను ఎత్తుకెళ్లిన దొంగలు
  • బీహార్ రాజధాని పాట్నాలో ఘటన
  • టవర్‌ను విడదీసి విడిభాగాలను ట్రక్కులో తరలించుకుపోయిన ముఠా
బీహార్‌లో ఓ దొంగల ముఠా పట్టపగలు అందరూ చూస్తుండగానే ఓ సెల్ టవర్‌ను ఎత్తుకెళ్లింది. రాజధాని పాట్నాలోని గార్డెన్‌బాగ్‌లో జరిగిందీ ఘటన. ఇక్కడి కచ్చి తలాబ్ ప్రాంతంలో ఓ మొబైల్ సర్వీస్ కంపెనీ ఏర్పాటు చేసిన సెల్ టవర్‌కు కొన్ని నెలలుగా అద్దె చెల్లించడం లేదు.  విషయం తెలిసిన దొంగల ముఠా టవర్‌ను లేపేయాలని ప్రణాళిక రచించింది. ప్లాన్ అమలులో భాగంగా 10 నుంచి 15 మంది ఉన్న దొంగల ముఠా టవర్ ఉన్న ప్రాంతానికి చేరుకుంది. 

తాము కంపెనీ నుంచి వచ్చామని, కంపెనీ నష్టాల్లో ఉండడంతో అద్దె చెల్లించలేకపోతున్నామని, టవర్‌ను తీసేయాలనుకుంటున్నామని యజమానిని కలిసి చెప్పారు. దానికి ఆయన అంగీకరించారు. ఆ వెంటనే  ముఠా సభ్యులు చకచకా టవర్ పైకెక్కి ఒక్కో భాగాన్ని విడదీస్తూ దానిని నేలమట్టం చేశారు. ఇందుకు వారికి రెండుమూడు రోజుల సమయం పట్టింది. ఆ తర్వాత విడి భాగాలను ట్రక్కులో వేసుకుని తరలించుకుపోయారు. ఆ టవర్‌ను 15-16 సంవత్సరాల క్రితం ఏర్పాటు చేసినట్టు భూమి యజమాని చెప్పాడు. 

మరోపక్క, టవర్ నుంచి సిగ్నళ్లు అందకపోవడంతో మరమ్మతుల కోసం వచ్చిన కంపెనీ అధికారులు అక్కడ టవర్ లేకపోవడం చూసి హతాశులయ్యారు. యజమానిని కలిసి ఆరా తీశారు. ఆయన చెప్పింది విని విస్తుపోయారు. అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దొంగల కోసం గాలిస్తున్నారు. దొంగలు ఎత్తుకెళ్లిన టవర్ విలువ రూ. 19 లక్షలు ఉంటుందని అధికారులు తెలిపారు.


More Telugu News