ఐదుగురు పిల్లల తల్లి.. మెస్సీ ఆట చూసేందుకు కారులో ఒంటరిగా కేరళ నుంచి ఖతార్​ కు ప్రయాణం

  • కేరళ నుంచి ఖతార్ వెళ్లిన మెస్సీ వీరాభిమాని
  • ప్రత్యేక ఎస్ యూవీ కారులో దేశ తీరాలు దాటి ప్రయాణం
  • తొలి మ్యాచ్ లో ఓడి రెండో మ్యాచ్ లో గెలిసిన అర్జెంటీనా
భారత ప్రజలు క్రికెట్ ను ఎంతగానో అభిమానిస్తారు. క్రికెటర్లను దేవుళ్లుగా ఆరాధిస్తారు. పశ్చిమ బెంగాల్, గోవా, కేరళలో మాత్రం మెజారిటీ ప్రజలు ఫుట్ బాల్ ను ఇష్టపడతారు. పలువురు సాకర్ మేటి క్రీడాకారులకు ఎంతో మంది వీరాభిమానులు ఉంటారు. అర్జెంటీనా సాకర్‌ దిగ్గజం లియోనల్‌ మెస్సీకి భారత్ లో కూడా మంచి ఫాలోయింగ్ ఉంది. కేరళకు చెందిన అలాంటి ఓ మహిళా అభిమాని అతని కోసం  పెద్ద సాహసమే చేసింది. ఐదుగురు పిల్లలకు తల్లి అయిన 33 ఏండ్ల నాజి నౌషి అనే సదరు వీరాభిమాని ఫిఫా ప్రపంచ కప్‌లో మెస్సీ ఆట చూసేందుకు కేరళ నుంచి ఖతార్‌ వెళ్లింది. 

ఇందులో విశేషం ఏముందని అనుకుంటున్నారా? ఆమె కారులో ఒంటరిగా ఖతార్‌కు చేరుకుంది. ఫిఫా ప్రపంచ కప్, మెస్సీ ఫొటోలతో ప్రత్యేక సౌకర్యాలు ఏర్పాటు చేసిన ఓ ఎస్‌యూవీ కారులో అక్టోబర్‌ 15న మొదలైన ఆమె ప్రయాణం దేశ తీరాలు దాటి ఖతార్ చేరింది. అయితే, అర్జెంటీనా జట్టు ఆడిన తొలి మ్యాచ్ లోనే ఓడిపోవడంతో అందరు అభిమానుల మాదిరిగానే ఆమె కూడా షాక్ కు గురైంది. కానీ, మెస్సీసేన పుంజుకుంటుందని ఆమె ఆశాభావం వ్యక్తం చేసింది. తను చెప్పినట్టుగానే శనివారం అర్ధరాత్రి జరిగిన మ్యాచ్ లో అర్జెంటీనా 2–0 గోల్స్ తేడాతో మెక్సికోను ఓడించి ప్రపంచ కప్ నాకౌట్ రేసులో నిలిచింది.


More Telugu News