తన జీవితంలోని అత్యంత దారుణమైన పరిస్థితులను వివరించిన వసీమ్ అక్రమ్

  • క్రికెట్ నుంచి తప్పుకున్నాక వ్యాఖ్యాతగా మారిన అక్రమ్
  • ఓసారి ఇంగ్లండ్ లో తొలిసారి డ్రగ్స్ వాడినట్టు వెల్లడి
  • వ్యసనంలా మారిపోయిందని వివరణ
  • జీవితకథలో ఆసక్తికర అంశాలు
ప్రపంచ క్రికెట్లో అత్యంత ప్రతిభావంతుడైన ఫాస్ట్ బౌలర్లలో పాకిస్థానీ దిగ్గజం వసీమ్ అక్రమ్ కూడా ఒకడు. తాజాగా అక్రమ్ తన జీవితంపై 'సుల్తాన్: ఏ మెమోయిర్' అనే బయోగ్రఫీని తీసుకువచ్చాడు. ఇందులో తన జీవితంలోని అత్యంత దుర్భరమైన దశను అక్రమ్ వివరించాడు. 

ఓ దశలో తాను డ్రగ్స్ కు అలవాటుపడ్డానని, ఆ వ్యసనం నుంచి బయటపడేందుకు రెండున్నర నెలలు ఓ పునరావాస కేంద్రంలో ఉండాల్సి వచ్చిందని వెల్లడించాడు. ఆ పునరావాస కేంద్రం ఓ నరక కూపం వంటిదని నాటి అనుభవాలను గుర్తుచేసుకున్నాడు. 

"క్రికెట్ కెరీర్ కు గుడ్ బై చెప్పాక వ్యాఖ్యాతగా మారాను. ఆ సమయంలో ప్రపంచంలోని ఎక్కడ క్రికెట్ మ్యాచ్ లు జరుగుతున్నా వెళ్లాల్సి వచ్చేది. ఓసారి ఇంగ్లండ్ వెళ్లగా, అక్కడ ఓ పార్టీలో తొలిసారి కొకైన్ రుచిచూశాను. ఆట నుంచి రిటైరయ్యాం కాబట్టి డ్రగ్స్ వాడినా సమస్యేమీ ఉండదనుకున్నాను. ఆ తర్వాత పాకిస్థాన్ కు తిరిగొచ్చాను. 

కానీ కొకైన్ అనేది ఓ వ్యసనంలా మారింది. అప్పటికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్న నేను కొకైన్ లేకుండా ఒక్క క్షణం కూడా ఉండలేని పరిస్థితి ఏర్పడింది. దాంతో ఇంట్లో ఎప్పుడూ భార్యతో గొడవలు జరిగేవి. డ్రగ్స్ వ్యసనం నుంచి కోలుకునేందుకు అత్యవసరంగా చికిత్స అవసరమని ఆమె నాకు స్పష్టం చేసింది. దాంతో మాకు దగ్గర్లోనే ఉన్న ఓ డ్రగ్ డీఎడిక్షన్ సెంటర్ లో చేరాను. 

కేవలం నెల రోజులు మాత్రమే ఉంటానని చెప్పి ఆ పునరావాస కేంద్రంలో చేరాను. కానీ అక్కడ నన్ను రెండున్నర నెలలు ఉంచారు. ఆ పునరావాస కేంద్రంలో పరిస్థితులు దారుణంగా ఉండేవి. పాశ్చాత్య దేశాల్లో డ్రగ్స్ పునరావాస కేంద్రాల్లో ఎంతో మెరుగైన సదుపాయాలు ఉంటాయి. అక్కడ ప్రశాంతంగా ఉండొచ్చు. కానీ పాకిస్థాన్ లో నేను చేరిన పునరావాస కేంద్రంలో కేవలం 8 గదులు, ఓ వరండా మాత్రమే ఉండేవి. అదొక భయానక అనుభవం. 

ఇక నా జీవితంలో అత్యంత విషాదం ఏమిటంటే... నా భార్య అనారోగ్యంతో మరణించింది. పిల్లల కోసం నన్ను నేను మార్చుకోవాలని నిర్ణయించుకున్నా. అప్పటివరకు ఎలా బతికానో తెలుసు. రెండేళ్ల పాటు కుటుంబాన్ని గాలికి వదిలేశాను. పిల్లలకు చివరిసారిగా బట్టలు ఎప్పుడు కొన్నానో, వాళ్లేం తింటున్నారో కూడా తెలియదు. భార్య పోయిన తర్వాత మాత్రం వారికి అన్నీ నేనే అయ్యాను. స్కూల్లో పేరెంట్స్ మీటింగ్ కు కూడా వెళ్లకతప్పలేదు" అని అక్రమ్ తన బయోగ్రఫీలో వివరించారు.


More Telugu News