ఎన్టీఆర్ చెప్పినా విననందుకు కాంతారావు బాధపడ్డారట!

  • తాజా ఇంటర్వ్యూలో మాట్లాడిన కాంతారావు కూతురు 
  • తన తండ్రి గారంగా పెరిగారంటూ వివరణ 
  • అందువల్లనే ఎవరి మాటా వినేవారు కాదంటూ వ్యాఖ్య 
  • వద్దన్న పని తప్పకుండా చేసేవారని వెల్లడి
అప్పట్లోనే తెలంగాణ నుంచి వెండితెరకి పరిచయమైన కాంతారావు, కథానాయకుడిగా ఎన్టీఆర్ .. ఏఎన్నార్ తరువాత స్థానంలో నిలిచారు. ఎన్టీఆర్ .. ఏఎన్నార్ ల మాదిరిగానే సొంత నిర్మాణ సంస్థను ఏర్పాటు చేసుకుని, వరుస సినిమాలు నిర్మించారు. ఆ సినిమాలు ఆడకపోవడం వలన ఆయన ఆర్ధికంగా దెబ్బతిన్నారు. 

ఈ విషయాలను గురించి ఒక యూట్యూబ్ ఛానెల్ ఇంటర్వ్యూలో కాంతారావు కూతురు సుశీలా రావు మాట్లాడుతూ .. " మా నాన్నగారి చిన్నతనంలోనే మా తాతగారు చనిపోయారు. అందువలన మా నాన్నగారిని వాళ్ల అమ్మగారు చాలా గారంగా పెంచారు. ఏ విషయంలోనైనా ఆయన మాట నెగ్గవలసిందే. అందువలన ఆయన ఎవరి మాటా వినేవారు కాదు .. తనకి తోచిందే చేసేవారు. వద్దని చెబితే దానినే తప్పకుండా చేసేవారు" అన్నారు. 

"సినిమాల నిర్మాణం జోలికి పోవద్దని ఎన్టీఆర్ గారు చెప్పిన మాట నిజమే. కానీ నష్టపోయిన తరువాత మాత్రమే ఆయన మాట వింటే బాగుండేదని అనుకునేవారు. నా పెళ్లికి కృష్ణగారు మాత్రం సహాయం చేశారు. అలాగే తాము ఏ సినిమా తీసినా అందులో నాన్నగారికి వేషం ఇస్తానని చెప్పారు .. ఇస్తూ వెళ్లారు కూడా.  నాన్నగారికి సినిమా తప్ప మరేమీ తెలియదు. అందువలన చివరివరకూ నటిస్తూ వెళ్లారు. ఆయన మా కోసం ఏమీ మిగల్చలేదనే బాధ మాకు ఎప్పుడూ లేదు" అంటూ చెప్పుకొచ్చారు. 



More Telugu News