ఐఫోన్ల ఉత్పత్తికి తీవ్ర విఘాతం.. చైనా ఫాక్స్ కాన్ ప్లాంట్ లో సంక్షోభం

  • 20,000 మంది ఉద్యోగుల గుడ్ బై
  • ఒక్కొక్కరికి రూ.1.15 లక్షల ప్యాకేజీ
  • తాత్కాలికంగా ఉత్పత్తిపై తీవ్ర ప్రభావం
చైనాలో ఐఫోన్ల తయారీ అతిపెద్ద కేంద్రమైన ఫాక్స్ కాన్ ప్లాంట్ నుంచి 20 వేల మంది ఉద్యోగులు వైదొలిగారు. ఫాక్స్ కాన్ కు చెందిన జెంగ్జూ ప్లాంట్ వద్ద ఉద్యోగుల నిరసన హింసాత్మక రూపం దాల్చడం తెలిసిందే. తమకు చెల్లిస్తున్న వేతనాలు, పని విధానంపై ఆగ్రహించిన ఉద్యోగులు పెద్ద ఎత్తున నిరసనకు దిగారు. 

ఈ నిరసనలను శాంతింపజేసేందుకు ఉద్యోగులకు 10 వేల యువాన్లు (రూ.1.15 లక్షలు) ఇస్తానంటూ ఫాక్స్ కాన్ ముందుకు వచ్చింది. ఈ ప్యాకేజీ తీసుకుని వెళ్లిపోవాలని కోరింది. కంపెనీ హామీ మేరకు మెజారిటీ ఉద్యోగులు (సుమారు 20వేల మంది) కంపెనీ నుంచి వెళ్లిపోయారు. వేతన చెల్లింపులకు సంబంధించి ఏర్పడిన సాంకేతిక సమస్యలకు ఫాక్స్ కాన్ ఉద్యోగులకు క్షమాపణ కూడా చెప్పింది. ఈ పరిణామంతో యాపిల్ ఐఫోన్ల ఉత్పత్తిపై తీవ్ర ప్రభావం పడింది. ఫలితంగా ఫోన్ల సరఫరా తగ్గే అవకాశాలు కనిపిస్తున్నాయి.


More Telugu News