ఐపీఎల్ ఆక్షన్ తేదీలు మారొచ్చు!.. వేలంలో వీరికి డిమాండ్

  • డిసెంబర్ 23న కొచ్చిలో జరగాల్సిన మినీ వేలం
  • క్రిస్ మస్ ఉండడంతో తేదీ మార్చాలన్న అభ్యర్థనలు
  • శామ్ కుర్రన్, బెన్ స్టోక్స్, కామెరాన్ గ్రీన్ కు డిమాండ్
ఐపీఎల్ మినీ వేలం నిర్ణీత షెడ్యూల్ ప్రకారం డిసెంబర్ 23న కొచ్చిలో జరగాలి. అయితే, దీన్ని మార్చాలంటూ ఇప్పుడు పెద్ద ఎత్తున అభ్యర్థనలు వస్తున్నాయి. క్రిస్ మస్ పర్వదినం సందర్భంగా కోచ్ లు, విదేశీ సిబ్బంది అందుబాటులో ఉండరంటూ ఫ్రాంచైజీలు వేలం తేదీని మార్చాలని కోరుతున్నాయి. పాశ్చాత్య దేశాల్లో క్రిస్ మస్ సందర్భంగా డిసెంబర్ మధ్య నుంచి చివరి వరకు ఎక్కువ మంది హాలిడే పర్యటనల్లో ఉంటారు. దీంతో ఫ్రాంచైజీలు ఈ విధంగా కోరడం గమనార్హం. దీనిపై బీసీసీఐ ఇంకా నిర్ణయం తీసుకోలేదు. చర్చల తర్వాత నిర్ణయం తీసుకుంటామని బీసీసీఐ అధికారి ఒకరు తెలిపారు.

ఇక ఐపీఎల్ వేలంలో పాల్గొనదలచిన క్రికెటర్లు డిసెంబర్ 15 నాటికి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంది.  250 మంది క్రికెటర్లు వేలానికి రానున్నారు. కానీ, ఫ్రాంచైజీలకు కావాల్సింది సుమారు 50-60 మందే. ఈ విడత ఇంగ్లండ్ మాజీ టెస్ట్ కెప్టెన్ జో రూట్ కూడా రిజిస్టర్ చేసుకున్నాడు. ప్రధానంగా శామ్ కుర్రన్, బెన్ స్టోక్స్, కామెరాన్ గ్రీన్ కోసం ఈ విడత ఫ్రాంచైజీల మధ్య పోటీ ఎక్కువగా ఉండనుంది.

2022 ఐపీఎల్ సీజన్ కు ఆరోగ్య సమస్యల కారణంగా బెన్ స్టోక్స్ దూరంగా ఉన్నాడు. ఈ ఆల్ రౌండర్ కోసం ఎక్కువ ఫ్రాంచైజీలు పోటీ పడొచ్చు. ఇక ఇంగ్లండ్ కే చెందిన టీ20 ప్లేయర్ శామ్ కుర్రన్ ఈ ఏడాది టీ20 ప్రపంచకప్ లో అదరగొట్టడం తెలిసిందే. దీంతో ఇతడిపైనా ఎక్కువ ఫ్రాంచైజీలు కన్నేశాయి. సీఎస్కే ఇతడ్ని గత సీజన్ కు ముందు విడుదల చేయడం గమనార్హం. ఇక 2022 టీ20 ప్రపంచకప్ లో మంచి పనితీరు చూపించిన ఆటగాళ్లలో కామెరాన్ గ్రీన్ కూడా ఒకడు.


More Telugu News