ఆ యాప్ ను గ్రామాల్లో కూడా అందుబాటులోకి తీసుకురండి: సీఎం జగన్ ఆదేశాలు

  • మున్సిపల్ శాఖపై సీఎం జగన్ సమీక్ష
  • మంత్రి ఆదిమూలపు సురేశ్, అధికారులు హాజరు
  • ఏపీ సీఎం ఎంఎస్ యాప్ పై సీఎం జగన్ దిశానిర్దేశం
ఏపీ సీఎం జగన్ ఇవాళ మున్సిపల్ శాఖపై సమీక్ష నిర్వహించారు. తాడేపల్లిలో సీఎం క్యాంపు కార్యాలయంలో జరిగిన ఈ సమావేశానికి రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్, పురపాలక శాఖ ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా సీఎం జగన్ పలు అంశాల్లో అధికారులకు దిశానిర్దేశం చేశారు. 

నగరాలు, పట్టణాల్లో మున్సిపల్ సర్వీసుల కోసం తీసుకువస్తున్న ఏపీ సీఎం ఎంఎస్ యాప్ ను గ్రామాల్లో కూడా అందుబాటులోకి తీసుకురావాలని ఆదేశించారు. ఈ యాప్ ద్వారా అందే గ్రీవెన్స్ ను పరిష్కరించే వ్యవస్థ పటిష్ఠంగా ఉండాలని స్పష్టం చేశారు. టౌన్ ప్లానింగ్ సహా, ఇతర విభాగాల్లో సాఫ్ట్ వేర్ అప్లికేషన్లను పరిశీలించాలని, తగిన ప్రణాళిక రూపొందించాలని అన్నారు. ప్రజలకు సత్వరమే సేవలు అందడం, నిర్దేశిత సమయంలోపు అనుమతులు, అవినీతి లేకుండా చేయడమే లక్ష్యంగా మార్పులు తీసుకురావాలని సీఎం జగన్ పేర్కొన్నారు. 

ఏపీ సీఎం ఎంఎస్ యాప్ కు పూర్తి రూపం... ఏపీ కన్సిస్టెంట్ మానిటరింగ్ ఆఫ్ మున్సిపల్ సర్వీసెస్. రోడ్లపై గుంతలు, మరమ్మతులు, వీధిలైట్లు, భూగర్భ డ్రైనేజీలు, పబ్లిక్ టాయిలెట్లు, పుట్ పాత్ లు, పచ్చదనం, బ్యూటిఫికేషన్, ట్రాఫిక్ కూడళ్లు-నిర్వహణ, మురుగు కాలువల్లో పూడిక తొలగింపు తదితర అంశాలను ఈ యాప్ సాయంతో రియల్ టైమ్ మానిటరింగ్ చేస్తారు. 

వార్డు సెక్రటరీలు ప్రతి రోజు తమ పరిధిలో తనిఖీలు చేసి ఎక్కడైనా సమస్య ఉంటే ఫొటో తీసి ఈ యాప్ లో అప్ లోడ్ చేయాల్సి ఉంటుంది. పౌరులు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు కూడా ఈ యాప్ సాయంతో ఫొటోలు తీసి అధికారులకు సమస్యలను నివేదించవచ్చు. మరో నెలలో ఈ యాప్ అందుబాటులోకి వస్తుందని భావిస్తున్నారు.


More Telugu News