ఎమ్మెల్యేలకు ఎర కేసులో బీజేపీ నేత బీఎల్ సంతోష్ కు హైకోర్టులో ఊరట

  • ఎమ్మెల్యేలకు ఎర కేసులో సంతోష్ కు సిట్ నోటీసులు 
  • ఉద్దేశపూర్వకంగానే తప్పుడు ఆరోపణలు చేస్తోందని ఆరోపించిన బీజేపీ నేత  
  • సీఆర్పీసీ నోటీసులను రద్దు చేయాలని కోరుతూ పిటిషన్
  • సిట్ నోటీసుల అమలును నిలుపుదల చేసిన హైకోర్టు    
ఎమ్మెల్యేలకు ఎర కేసులో బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్ పేరు కూడా తెరపైకి రావడం తెలిసిందే. ఈ కేసు విచారణ చేపట్టిన తెలంగాణ సిట్ బీఎల్ సంతోష్ ను కూడా నిందితుల జాబితాలో చేర్చింది. ఆయనకు సీఆర్పీసీ 41ఏ కింద నోటీసులు జారీ చేసింది. 

తనను నిందితుడిగా పేర్కొని నోటీసులు ఇవ్వడం పట్ల బీఎల్ సంతోష్ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. తనపై తెలంగాణ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే తప్పుడు ఆరోపణలు చేస్తోందని, సంబంధంలేని వ్యవహారంలో తన పేరును ప్రచారం చేస్తున్నారని బీఎల్ సంతోష్ తన పిటిషన్ లో ఆరోపించారు. సీఆర్పీసీ నోటీసులను రద్దు చేయాలని హైకోర్టును కోరారు. 

ఈ మేరకు ఆయన తరఫు న్యాయవాది లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన తెలంగాణ హైకోర్టు బీఎల్ సంతోష్ కు ఊరట కలిగిస్తూ కీలక ఆదేశాలు జారీ చేసింది. 

సిట్ జారీ చేసిన నోటీసుల అమలును నిలుపుదల చేసింది. ఈ మేరకు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. అనంతరం తదుపరి విచారణను డిసెంబరు 5కి వాయిదా వేసింది. 

వాదనల సందర్భంగా బీఎల్ సంతోష్ తరఫు న్యాయవాది స్పందిస్తూ.... ముందు నిర్ణయించుకున్న షెడ్యూల్ ప్రకారం కొన్ని పనులు ఉన్నందువల్ల తన క్లయింటు (బీఎల్ సంతోష్) కోర్టుకు రాలేకపోయారని న్యాయమూర్తికి తెలియజేశారు. 




More Telugu News