కమలహాసన్ ఆరోగ్యంపై తాజా బులెటిన్ విడుదల

  • జ్వరం, దగ్గుతో బాధపడుతున్న కమల్ 
  • అభిమానుల్లో ఆందోళన
  • చెన్నైలోని శ్రీరామచంద్ర మెడికల్ సెంటర్ లో చికిత్స
  • కమల్ ఆరోగ్యం నిలకడగా ఉందన్న వైద్యులు
  • రెండ్రోజుల్లో డిశ్చార్జి కావొచ్చని వెల్లడి
ప్రముఖ నటుడు కమలహాసన్ అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరడం పట్ల అభిమానుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. జ్వరం, దగ్గుతో బాధపడుతున్న కమల్ నిన్న సాయంత్రం చెన్నైలోని శ్రీరామచంద్ర మెడికల్ సెంటర్ ఆసుపత్రిలో చేరారు. నిన్న హైదరాబాదులో కళాతపస్వి కె.విశ్వనాథ్ ను కలిసిన ఆయన, సాయంత్రానికి ఆసుపత్రి పాలవడంతో అభిమానుల్లో కలకలం రేగింది. 

ఈ నేపథ్యంలో, శ్రీరామచంద్ర మెడికల్ సెంటర్ వైద్యులు కమల్ ఆరోగ్యంపై తాజా బులెటిన్ విడుదల చేశారు. ప్రస్తుతం కమలహాసన్ ఆరోగ్యం నిలకడగా ఉందని తెలిపారు. ఆయన క్రమంగా కోలుకుంటున్నారని వివరించారు. కమల్ ఆరోగ్య పరిస్థితి మరింత కుదుటపడ్డాక, మరో రెండ్రోజుల్లో ఆయనను డిశ్చార్జి చేస్తామని వెల్లడించారు. 

కమల్ ఆసుపత్రిపాలైన నేపథ్యంలో, తమిళ బిగ్ బాస్ షో వీకెండ్ ఎపిసోడ్లు అనిశ్చితిలో పడ్డాయి. తమిళ బిగ్ బాస్ షోకు వ్యాఖ్యాతగా కమల్ వ్యవహరిస్తున్నారు. ఆయన శని, ఆదివారాల్లో ప్రసారమయ్యే ఎపిసోడ్లలో బిగ్ బాస్ స్టేజ్ పై అలరించాల్సి ఉంది. కమల్ రేపు డిశ్చార్జి అయితే ఈ రెండు ఎపిసోడ్లకు ఆయన హాజరయ్యే అవకాశాలున్నాయి.


More Telugu News