ఢిల్లీ లిక్కర్ స్కాంలో అభిషేక్ బోయినపల్లికి 14 రోజుల రిమాండ్

  • సంచలనం సృష్టించిన ఢిల్లీ లిక్కర్ స్కాం
  • కొనసాగుతున్న ఈడీ దర్యాప్తు
  • అభిషేక్ కు ముగిసిన ఈడీ కస్టడీ
  • కోర్టులో హాజరుపరిచిన అధికారులు
ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో నిందితుడు అభిషేక్ బోయినపల్లికి సీబీఐ ప్రత్యేక కోర్టు 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించింది. అభిషేక్ కి ఈడీ కస్టడీ ముగియడంతో అధికారులు అతడిని నేడు కోర్టులో హాజరుపరిచారు. వాదనలు విన్న న్యాయస్థానం, ఈ కేసులో ఈడీ విచారణ కొనసాగుతున్నందున రెండు వారాల జ్యుడీషియల్ రిమాండ్ విధిస్తున్నట్టు పేర్కొంది. 

మరో నిందితుడు విజయ్ నాయర్ ను మరో 4 రోజులు కస్టడీకి అప్పగించాలని ఈడీ అధికారులు కోర్టును కోరారు. అయితే న్యాయస్థానం రెండు రోజుల కస్టడీకి మాత్రమే అనుమతి ఇచ్చింది.

అటు, ఇతర నిందితులు శరత్ చంద్రారెడ్డి, బినోయ్ బాబుకు జైలులో ఇంటి నుంచి తెచ్చే ఆహారం అందించేందుకు నిరాకరించింది. జైలు నిబంధనల ప్రకారం ఇంటి భోజనం అనుమతించడం కుదరదని న్యాయమూర్తి స్పష్టం చేశారు. ఏదైనా కావాలనుకుంటే జైలు అధికారులకు చెప్పి చేయించుకోవాలని సూచించారు. 

కొన్ని పుస్తకాలు తెచ్చుకునేందుకు అవకాశం ఇవ్వాలని నిందితుల తరఫు న్యాయవాదులు విజ్ఞప్తి చేశారు. అందుకు న్యాయమూర్తి స్పందిస్తూ, జైలులో అన్ని పుస్తకాలు దొరుకుతాయని బదులిచ్చారు.


More Telugu News