ఇఫీ చలనచిత్రోత్సవంలో తెలుగు చిత్రం 'ఖుదీరాం బోస్' ప్రదర్శన

  • స్వాతంత్ర్యం కోసం ప్రాణత్యాగం చేసిన ఖుదీరాం బోస్
  • బోస్ జీవితం ఆధారంగా తెలుగులో బయోపిక్
  • ప్రధాన పాత్రలో రాకేష్ జాగర్లమూడి
  • విజయ్ జాగర్లమూడి, డీవీఎస్ రాజు దర్శకత్వం
  • ఇఫీ చలన చిత్రోత్సవానికి ఎంపిక
యువ రక్తం పొంగిపొర్లే వయసులో బ్రిటీష్ వారిపై తిరుగుబాటు బావుటా ఎగురవేసి, భరతమాత దాస్య శృంఖలాలను విడిపించే క్రమంలో ఉరికొయ్యకు వేలాడిన స్వాతంత్ర్య సమరమోధుడు ఖుదీరాం బోస్. ఈ భరతమాత ముద్దుబిడ్డ జీవితం ఆధారంగా తెలుగులో 'ఖుదీరాం బోస్' పేరిట బయోపిక్ తెరకెక్కింది. 

ఇప్పుడీ చిత్రానికి అరుదైన గౌరవం లభించింది. గోవాలో జరుగుతున్న 53వ ఇఫీ చలనచిత్రోత్సవంలో 'ఖుదీరాం బోస్' చిత్రాన్ని ప్రదర్శించారు. ఇఫీ ఫిలిం పెస్టివల్ లో ప్రధాన విభాగంగా పరిగణించే ఇండియన్ పనోరమా కేటగిరీలో ఈ చిత్రాన్ని ప్రదర్శించడం విశేషం. 

ఈ చిత్రంలో రాకేష్ జాగర్లమూడి ఖుదీరాం బోస్ పాత్ర పోషించగా, విజయ్ జాగర్లమూడి, డీవీఎస్ రాజు దర్శకత్వం వహించారు. గోల్డెన్ రెయిన్ ప్రొడక్షన్స్ పతాకంపై నిర్మాణం జరుపుకున్న ఈ ఐకానిక్ బయోపిక్ కు రజిత విజయ్ నిర్మాత. ఈ సినిమా తెలుగులోనే కాకుండా తమిళ, మలయాళ, కన్నడ, హిందీ, బెంగాలీ భాషల్లోనూ రూపుదిద్దుకుంది. 

రాకేష్ జాగర్లమూడికి నటుడిగా తొలిచిత్రం అయినప్పటికీ పిన్న వయసు స్వాతంత్ర్య సమరయోధుడు ఖుదీరాం బోస్ పాత్రలో ఒదిగిపోయిన తీరు విమర్శకులను ఆకట్టుకుంది. ఈ చిత్రంలో వివేక్ ఓబెరాయ్, నాజర్, అతుల్ కులకర్ణి వంటి సీనియర్ నటులు కీలకపాత్రలు పోషించారు.


More Telugu News