విటమిన్ డి.. మధుమేహానికి మధ్య బంధం ఏంటి?

  • విటమిన్ డి లోపంతో పెరిగే మధుమేహం రిస్క్
  • ఇన్సులిన్ విడుదలలో కీలక పాత్ర
  • డయాబెటిస్ చేరువలో ఉన్న వారిలోనూ మంచి ఫలితాలు
విటమిన్ డి మన దేహానికి ముఖ్యమైన వాటిల్లో ఒకటి. సూర్యుడి కిరణాలు మన శరీరంపై పడినప్పుడు.. సహజసిద్ధంగా ఇది తయారవుతుంది. కానీ, రోజులు మారిపోయాయి. చదువుకుని, చక్కగా సంపాదించుకునే వారు ఏసీ వాహనాలు, ఏసీ గదుల్లో సేదతీరుతూ, ఎండకు దూరమవుతున్నారు. దీంతో సహజసిద్ధ వ్యవస్థ దెబ్బతింటోంది. విటమిన్ డి లోపిస్తోంది. ఇది ఎన్నో అనారోగ్యాలకు కారణమవుతోంది. రోగ నిరోధక వ్యవస్థ, ఎముకల ఆరోగ్యంలో విటమిన్ డి పాత్ర ముఖ్యమైనది. అంతేకాదు, విటమిన్ డి లోపం మధుమేహానికి దారితీస్తుందా? అన్న దానిపై ప్రపంచవ్యాప్తంగా ఎన్నో అధ్యయనాలు జరిగాయి.

తగ్గితే ముప్పే..
విటమిన్ డిని క్యాల్సిఫెరాల్ అని అంటారు. రక్తంలో గ్లూకోజ్ ఎప్పుడూ నియంత్రణలో ఉండాలి. అదుపు తప్పితే ఏర్పడేదే మధుమేహం. విటమిన్ డి ఇన్సులిన్ సెన్సిటివిటీని పెంచుతుంది. బ్లడ్ గ్లూకోజ్ ను నియంత్రణలో ఉంచడానికి ఇన్సులిన్ కీలకం అన్న సంగతి తెలిసిందే. విటమిన్ డి లోపిస్తే పాంక్రియాస్ నుంచి ఇన్సులిన్ విడుదల నిదానిస్తుంది. అందుకని కనీసం విటమన్ డి 80 ఎన్ఎంవోఎల్ అయినా ఉండాలి. 50 కంటే తక్కువ ఉన్న వారికి మధుమేహం రిస్క్ రెట్టింపు అవుతుందని పలు పరిశోధనల్లో వెల్లడైంది.

డయాబెటిస్ స్పెక్ట్రమ్ రిపోర్ట్ ప్రకారం.. విటమిన్ డి అన్నది కణాల్లో అధికంగా ఉన్న క్యాల్షియంను క్రమబద్ధీకరిస్తుంది. తద్వారా కణాల్లో క్యాల్షియం సాధారణ స్థాయిలో ఉండేలా చూస్తుంది. ఒకవేళ విటమిన్ డి తక్కువైతే ఇన్సులిన్ విడుదలను ప్రభావితం చేసే క్యాల్షియం సామర్థ్యం దెబ్బతింటుంది. 

జపాన్ లో 1,256 మంది ప్రీ డయాబెటిస్ (మధుమేహం అంచుల్లో ఉన్న వారు) వారిపై ఓ అధ్యయనం జరిగింది. వీరిని రెండు గ్రూపులుగా చేసి, ఒకరికి విటమిన్ డి సప్లిమెంట్ ఇచ్చి చూశారు. మరో గ్రూప్ లోని వారికి ఉత్తుత్తి విటమిన్ డి మాత్రలు ఇచ్చారు. విటమిన్ డి తీసుకున్న వారికి రిస్క్ తగ్గినట్టు గుర్తించారు. 

2021లో జరిగిన మరో అధ్యయనం ప్రకారం.. విటమిన్ డి సప్లిమెంట్లను మూడు నుంచి ఆరు నెలలు తీసుకున్న వారిలో హెచ్ బీఏ1సీ గణనీయంగా తగ్గినట్టు తెలుసుకున్నారు. హెచ్ బీఏ1సీ అన్నది క్రితం మూడు నెలల్లో సగటున మధుమేహం ఎంత ఉందన్నది చెబుతుంది. 

విటమిన్ డి ఎంత తీసుకోవాలి?
ఒకరు ఒక రోజుకు 4,000 ఐయూ మించి తీసుకోకూడదు. 14-70 ఏళ్ల మధ్య వయసు మహిళలు రోజువారీగా 600 ఐయూలను తీసుకోవచ్చు. అంతకుపైన వయసున్న మహిళలకు రోజువారీ 800 ఐయూ అవసరపడుతుంది.


More Telugu News