మాకు కేసీఆర్ ఉన్నారు... ఆయనే మా ధైర్యం: మల్లారెడ్డి

  • పాలు, పూలు అమ్మి ఈ స్థాయికి వచ్చానన్న మల్లారెడ్డి
  • ఈ స్థాయిలో ఐటీ రెయిడ్స్ జరగడం ఎప్పుడూ చూడలేదని వ్యాఖ్య
  • నా కొడుకుకి కూడా నా కాలేజీలో సీటు ఇవ్వలేనన్న మంత్రి
పాలు అమ్మి, పూలు అమ్మి, బోర్లు వేసి, వ్యాపారాలు చేసి, ఎంతో కష్టపడి తాను ఈ స్థాయికి వచ్చానని మంత్రి మల్లారెడ్డి చెప్పారు. తన జీవితం కూడా చాలా సాధారణంగా ఉంటుందని... ఖరీదైన బట్టలు వేసుకోనని, చేతికి ఒక్క ఉంగరం కూడా ఉండదని, రబ్బరు చెప్పులు వేసుకుంటానని తెలిపారు. టీఆర్ఎస్ పార్టీకి చెందిన మంత్రిననే ఒకే ఒక కారణంతో తమపై ఐటీ దాడులు చేశారని విమర్శించారు. 

ఇతర రాష్ట్రాలకు చెందిన ఐటీ అధికారులు వందల సంఖ్యలో వచ్చి రెయిడ్స్ చేయడం తన జీవితంలో ఎప్పుడూ చూడలేదని అన్నారు. తమ కుటుంబ సభ్యులను, తమ ప్రిన్సిపాళ్లను, స్టాఫ్ ను అందరినీ రెయిడ్స్ పేరుతో భయభ్రాంతులకు గురి చేశారని చెప్పారు. తమ స్టాఫ్ ఇళ్లకు వెళ్లి రెయిడ్స్ చేసి, ఆ తర్వాత కాలేజీల్లో వదిలి పెట్టారని తెలిపారు. కేంద్ర బలగాలతో దాడి చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. 

ఇలాంటి దాడులకు తాను భయపడనని మల్లారెడ్డి చెప్పారు. ఐటీ, ఈడీ దాడులు జరుగుతాయని ముఖ్యమంత్రి కేసీఆర్ ముందే చెప్పారని అన్నారు. తమకు కేసీఆర్ ఉన్నారని... ఆయనే తమ ధైర్యం అని చెప్పారు. అంతా కేసీఆర్ చూసుకుంటారని అన్నారు. ప్రభుత్వం నిర్ధారించిన ఫీజుకు తమ కాలేజీల్లో మంచి విద్యను అందస్తున్నామని చెప్పారు. 

కాలేజీల ఆర్థిక లావాదేవీలన్నీ ఆన్ లైన్ ద్వారానే జరుగుతున్నాయని... అలాంటప్పుడు అక్రమాలకు చోటెక్కడుంటుందని ప్రశ్నించారు. తమ మెడికల్ కాలేజీలో మేనేజ్ మెంట్ కోటానే లేదని... ఏ, బీ, సీ కేటగిరీ సీట్లన్నీ ప్రభుత్వం నిర్వహించే కౌన్సిలింగ్ ద్వారానే భర్తీ అవుతాయని చెప్పారు. తన విద్యా సంస్థలల్లో తన కొడుకుకి కూడా తాను సీటు ఇవ్వలేనని... తన కొడుకైనా కౌన్సిలింగ్ ద్వారానే సీటు తెచ్చుకోవాలని అన్నారు.


More Telugu News