ప్రాంతీయ సమన్వయకర్త బాధ్యతల నుంచి సజ్జల, బుగ్గన, అనిల్, కొడాలికి ఉద్వాసన

  • పార్టీలో పలు మార్పులు చేసిన వైసీపీ అధిష్ఠానం
  • జిల్లాల సమన్వయకర్తలు, జిల్లా అధ్యక్షుల మార్పు
  • విజయసాయి రెడ్డికి సహాయకారిగా చెవిరెడ్డి భాస్కరరెడ్డి
ఏపీలోని అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో పలు మార్పులు చోటుచేసుకున్నాయి. ప్రాంతీయ సమన్వయకర్తల బాధ్యతల నుంచి సజ్జల రామకృష్ణారెడ్డి, ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి, మాజీ మంత్రులు కొడాలి నాని, అనిల్ కుమార్ యాదవ్‌లను అధిష్ఠానం తప్పించింది. 

ఈ క్రమంలో సజ్జల, బుగ్గన సమన్వయం చేసిన కర్నూలు, నంద్యాల జిల్లాల బాధ్యతను వైఎస్సార్ జిల్లా జడ్పీ చైర్మన్ ఆకేపాటి అమర్‌నాథ్‌రెడ్డికి అప్పగించింది. అలాగే, ఇప్పటి వరకు అనిల్ కుమార్ చూసుకున్న వైఎస్సార్, తిరుపతి జిల్లాలను నెల్లూరు ప్రాంతీయ సమన్వయకర్తగా ఉన్న మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డికి అప్పగించింది. బాలినేని విషయంలో మాత్రం మినహాయింపు ఇచ్చిన అధిష్ఠానం.. ఆయన ఇప్పటి వరకు చూస్తున్న మూడు జిల్లాల్లో నెల్లూరును కొనసాగించింది. 

బాపట్ల జిల్లా సమన్వయ బాధ్యతను ఎంపీ బీద మస్తాన్‌రావుకు అప్పగించగా, కొడాలి నాని వద్దనున్న పల్నాడు బాధ్యతను ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌రెడ్డికి అప్పగించింది. కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల ప్రాంతీయ సమన్వయకర్త మర్రి రాజశేఖర్‌కు గుంటూరు జిల్లా బాధ్యతను అప్పగించింది. ఈ మూడు జిల్లాల ప్రాంతీయ సమన్వయకర్తగా మర్రి రాజేశేఖర్‌తోపాటు ఎంపీ ఆళ్ల అయోధ్య రామిరెడ్డికి కొత్తగా బాధ్యతలు అప్పగించింది. విజయనగరం జిల్లా బాధ్యతను మంత్రి బొత్స సత్యనారాయణ నుంచి టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డికి అప్పగించింది. ఇప్పటి వరకు ఆయన చూస్తున్న అల్లూరి సీతారామరాజు జిల్లాను బొత్సకు అప్పగించింది.

తిరుపతి జిల్లా వైసీపీ అధ్యక్ష పదవి నుంచి చెవిరెడ్డి భాస్కరరెడ్డిని తప్పించిన అధిష్ఠానం, ఆ పార్టీ అనుబంధ విభాగాల సమన్వయకర్త బాధ్యతలను ఆయనకు అప్పగించింది. పార్టీ రాష్ట్ర సమన్వయకర్త ఎంపీ విజయసాయిరెడ్డికి చెవిరెడ్డి సహాయకారిగా వ్యవహరించనున్నారు. అలాగే, కుప్పం వైసీపీ బాధ్యుడు, ఎమ్మెల్సీ భరత్‌ను చిత్తూరు జిల్లా అధ్యక్ష బాధ్యతల నుంచి తప్పించింది. ఆ బాధ్యతలను డిప్యూటీ సీఎం నారాయణస్వామికి అప్పగించింది. ఎమ్మెల్యేలు పుష్ప శ్రీవాణి, అవంతి శ్రీనివాస్, సుచరిత, బుర్రా మధుసూదన్ యాదవ్, వై.బాలనాగిరెడ్డి, కాపు రామచంద్రారెడ్డి, చెవిరెడ్డి భాస్కరరెడ్డిలను జిల్లా పార్టీ బాధ్యతల నుంచి తప్పించింది.


More Telugu News