ఫిఫా ప్రపంచకప్‌లో వరుస సంచలనాలు.. జర్మనీకి జపాన్ షాక్!

  • నిన్న అర్జెంటినాను కంగు తినిపించిన సౌదీ అరేబియా
  • నేడు జర్మనీని 2-1 తేడాతో ఓడించిన జపాన్
  • ఆస్ట్రేలియాపై డిఫెండింగ్ చాంపియన్ ఫ్రాన్స్ విజయం
ఎడారి దేశం ఖతర్ వేదికగా జరుగుతున్న ఫిఫా ప్రపంచకప్‌లో వరుస సంచలనాలు నమోదవుతున్నాయి. నిన్న జరిగిన మ్యాచ్‌లో దిగ్గజ ఆటగాడు లియోనల్ మెస్సీ సారథ్యంలోని అర్జెంటినాను ఓడించిన పసికూన సౌదీ అరేబియా చరిత్ర సృష్టించింది. తాజాగా, మరో సంచలనం నమోదైంది. 

నేడు జర్మనీతో జరిగిన మ్యాచ్‌లో జపాన్ అద్భుత విజయం సాధించింది. ఈ మ్యాచ్ కూడా నిన్నటి అర్జెంటినా- సౌదీ అరేబియా మ్యాచ్‌ను తలపించింది. తొలి అర్ధ భాగం ముగిసే సరికి జర్మనీ 1-0తో ఆధిక్యంలో నిలిచింది. అయితే, ఆ తర్వాత జపాన్ ఆటగాళ్లు విజృంభించి స్వల్ప వ్యవధిలోనే రెండు గోల్స్ సాధించారు. ఆ తర్వాత జర్మనీని జాగ్రత్తగా అడ్డుకుంటూ నిలువరించగలిగారు. దీంతో మ్యాచ్ ముగిసే సరికి 2-1తో జపాన్ విజయం సాధించి సంచలనం నమోదు చేసింది.

మరోవైపు, డిఫెండింగ్ చాంపియన్ ఫ్రాన్స్-ఆస్ట్రేలియా మధ్య జరిగిన మ్యాచ్‌లో ఫ్రాన్స్ 4-1తో విజయం సాధించింది. ఫ్రాన్స్ ఆటగాళ్ల దూకుడు ముందు నిలవలేకపోయిన ఆస్ట్రేలియా వరుస గోల్స్ సమర్పించుకుని ఓటమి పాలైంది. మొరాకో-క్రొయేషియా మధ్య జరిగిన మరో మ్యాచ్ డ్రాగా ముగిసింది.


More Telugu News