4 నెలల్లో 35 వేల ఉద్యోగాల భర్తీ: రైల్వే బోర్డు ఈడీ

  • గత నోటిఫికేషన్లను పూర్తిచేస్తామని ప్రకటించిన అమితాబ్ శర్మ
  • 2023 మార్చి 31 లోగా నియామక పత్రాలు అందజేస్తామని వెల్లడి
  • ఒకదాని తర్వాత మరో నోటిఫికేషన్ ఫలితాలు విడుదల చేస్తామని వివరణ
రోజ్ గార్ మేళాలో భాగంగా రైల్వే శాఖ పెద్ద సంఖ్యలో ఉద్యోగాలను భర్తీ చేయనుంది. ఇందుకోసం ఉద్యోగాల భర్తీపై టైం టేబుల్ ను ప్రకటించింది. వచ్చే ఏడాది మార్చిలోగా 35,281 ఉద్యోగాల భర్తీకి రైల్వే బోర్డు సన్నాహాలు చేస్తోంది. ఇప్పటికే జారీ చేసిన ప్రకటనలు, నియామక ప్రక్రియ వివిధ దశలలో ఉన్న వాటిని వచ్చే నాలుగు నెలల్లో పూర్తిచేయనున్నట్లు రైల్వే బోర్డు ఈడీ అమితాబ్ శర్మ వెల్లడించారు. 

2019లో జారీ చేసిన నాన్ టెక్నికల్ పాప్యులర్ కేటగిరీ పోస్టుల భర్తీకి 2021లో రైల్వే బోర్డు పరీక్షలు నిర్వహించింది. ఇందులో జూనియర్ అకౌంట్ అసిస్టెంట్స్, గూడ్స్ గార్డు, కమర్షియల్ అప్రెంటీస్, టికెట్ క్లర్కులు, సీనియర్ క్లర్క్ కం టైపిస్టులు, టైంకీపర్ తదితర ఉద్యోగాలకు దశల వారీగా పరీక్షలు నిర్వహిస్తోంది. ఈ ప్రక్రియను వేగంగా పూర్తిచేసి 2023 మార్చి 31 లోపు అందరికీ అపాయింట్ మెంట్ లెటర్లు అందిస్తామని అమితాబ్ శర్మ వివరించారు.

ఒకేసారి అన్ని నోటిఫికేషన్ల ఫలితాలు విడుదల చేయడంవల్ల కిందిస్థాయి ఉద్యోగాలలో ఖాళీలు మిగిలిపోతున్నాయని, బ్యాక్ లాగ్ పడుతున్నాయని శర్మ తెలిపారు. రెండు, మూడు ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న వాళ్లు పెద్ద పోస్టుకు ఎంపికైతే అప్పటికే చేరిన చిన్న ఉద్యోగాన్ని వదిలేస్తున్నారని తెలిపారు. దీంతో చాలామంది అర్హులైన అభ్యర్థులు ఉద్యోగ ప్రయోజనాలను కోల్పోతున్నారని చెప్పారు. అందుకే ఒకదాని తర్వాత మరో నోటిఫికేషన్ ఫలితాలను విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని వివరించారు.


More Telugu News