సంజు శాంసన్​కు అవకాశం ఇవ్వకపోవడానికి కారణం ఏంటో చెప్పిన హార్దిక్​ పాండ్యా

  • న్యూజిలాండ్ పర్యటనలో ఉన్న భారత జట్టు
  • హార్దిక్ పాండ్యా కెప్టెన్సీలో టీ20 సిరీస్ లో 1–0తో గెలిచిన భారత్
  • శాంసన్, ఉమ్రాన్ మాలిక్ లకు తుది జట్టులోఅవకాశం రాకపోవడంపై విమర్శలు
ఆస్ట్రేలియా వేదికగా జరిగిన టీ20 ప్రపంచకప్‌లో నిరాశ పరిచిన తర్వాత న్యూజిలాండ్ తో జరిగిన టీ20 సిరీస్ లో భారత్ 1–0తో విజేతగా నిలిచింది. రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్, మహ్మద్ షమీ, బుమ్రా తదితర సీనియర్లు రెస్ట్ తీసుకోవడంతో హార్దిక్ పాండ్యా నేతృత్వంలో యువ ఆటగాళ్లతో భారత్ బరిలోకి దిగింది. ఈ సిరీస్ లో తొలి మ్యాచ్ వర్షం వల్ల రద్దయింది. మూడో మ్యాచ్ కూడా వర్షం కారణంగా టైగా ముగిసింది. అయితే, రెండో మ్యాచ్ లో ఘన విజయం సాధించడంతో భారత్ సిరీస్ సొంతం చేసుకుంది. 

అయితే, జరిగిన రెండు మ్యాచ్ ల్లో యువ ఆటగాడు సంజు శాంసన్ కు తుది జట్టులో అవకాశం ఇవ్వకపోవడంపై విమర్శలు వస్తున్నాయి. సీనియర్లు లేనప్పుడు కూడా శాంసన్ ను తుది జట్టులో ఆడించకపోవడంపై అభిమానులతో పాటు మాజీ క్రికెటర్లు సైతం భారత మేనేజ్ మెంట్ పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రపంచకప్ లో విఫలమైన రిషభ్‌ పంత్‌, భువనేశ్వర్‌ కుమార్‌, దీపక్‌ హుడాలకే మళ్లీ అవకాశాలు ఇచ్చి, సంజు శాంసన్‌ తో పాటు ఉమ్రాన్‌ మాలిక్‌, కుల్దీప్‌ యాదవ్‌ లాంటి ప్లేయర్‌ను పూర్తిగా బెంచ్‌కే పరిమితం చేయడం సరికాదని అంటున్నారు. 

ఈ విమర్శలపై సిరీస్ ముగిసిన అనంతరం తాత్కాలిక కెప్టెన్‌ హార్దిక్‌ పాండ్యా స్పందించారు. అతనికి అవకాశం రాకపోవడం దురదృష్టకరం అన్నాడు. జట్టు వ్యూహాల్లో భాగంగానే తుది జట్టులో అతనికి చోటు లేకుండా పోయిందని చెప్పాడు. అదే సమయంలో జట్టులో చోటు దక్కకపోవడంపై అసంతృప్తిగా ఉన్న ప్లేయర్లు తనతో వచ్చి మాట్లాడవచ్చని హార్దిక్ చెప్పాడు. ఆరోగ్యకరమైన చర్చ కోసం తన గది తలుపులు ఎప్పుడూ తెరిచే ఉంటాయని స్పష్టం చేశాడు.


More Telugu News