జూ పార్క్ లో కంచె దాటేందుకు హిప్పో యత్నం.. అడ్డుకున్న గార్డ్

  • చేత్తో కొడుతూ వెనక్కి పంపించేందుకు సెక్యూరిటీ గార్డ్ ప్రయత్నం
  • పెద్దగా నోరు తెరిచి హుంకరించిన హిప్పో
  • చివరికి వెనక్కి తగ్గడంతో ఊపిరి పీల్చుకున్న సందర్శకులు
జూ పార్క్ లో ఓ హిప్పోపోటమస్ (నీటి ఏనుగు) తన చుట్టూ ఏర్పాటు చేసిన రక్షణ కంచెను దాటి వచ్చేందుకు ప్రయత్నించింది. అయితే, ఓ గార్డ్ ధైర్యంతో చేసిన ప్రయత్నం ఫలించడంతో పెద్ద ప్రమాదం తప్పినట్టయింది. ఇందుకు సంబంధించిన వీడియోను ఓ వ్యక్తి తన ట్విట్టర్ పేజీలో పోస్ట్ చేయడంతో వైరల్ గా మారింది. 

హిప్పోలు చాలా ప్రమాదకరమైనవి. మనుషుల పట్ల ఇవి క్రూర స్వభావంతోనే వ్యవహరిస్తుంటాయి. ఆఫ్రికాలో ఏటా సుమారు 500 మంది వరకు వీటి దాడిలో మరణిస్తున్నారు. అటువంటిది జూ సెక్యూరిడీ గార్డ్ తన వద్ద ఎలాంటి ఆయుధం లేకపోయినా, చేత్తోనే దాన్ని నియంత్రించాడు.  

నీటి కొలను దాటి పక్కనే ఉన్న రక్షణ కంచెను దాటి వచ్చేందుకు నీటి ఏనుగు ప్రయత్నించింది. ఇది చూసి అక్కడే ఉన్న గార్డ్ దాని ముఖంపై చేత్తో కొడుతూ భయపెట్టాడు. అది పెద్దగా నోరు తెరిచి అరిచినా, చివరికి వెనక్కి వెళ్లింది. దీంతో సందర్శకులు ఊపిరి పీల్చుకున్నారు. ఇది ఢిల్లీ జూపార్క్ లో ఈ ఏడాది ఆరంభంలో చోటుచేసుకున్న ఘటనగా తెలుస్తోంది. కాకపోతే ప్రస్తుతం ట్విట్టర్లో ఇది ఎక్కువగా షేర్ అవుతోంది.


More Telugu News