స్విట్జర్లాండ్ టూరిజం ఫ్రెండ్షిప్ అంబాసిడర్ గా ఒలింపిక్ విజేత నీరజ్ చోప్రా

  • నీరజ్ చోప్రాతో స్విట్జర్లాండ్ టూరిజం భాగస్వామ్యం
  • సౌహార్ద్ర రాయబారిగా నియామకం
  • టూరిజం అభివృద్ధి దిశగా నిర్ణయం
ఒలింపిక్ జావెలిన్ స్వర్ణ పతక విజేత నీరజ్ చోప్రాకు అరుదైన ఘనత లభించింది. నీరజ్ చోప్రా స్విట్జర్లాండ్ టూరిజం ఫ్రెండ్షిప్ అంబాసిడర్ గా నియమితుడయ్యాడు. ప్రకృతి అందాలకు నెలవైన స్విట్జర్లాండ్ లోని ప్రముఖ పర్యాటక స్థలాలకు భారత యాత్రికులను ఆకర్షించే దిశగా నీరజ్ చోప్రాతో భాగస్వామ్యం ఉపయోగపడుతుందని స్విస్ టూరిజం శాఖ భావిస్తోంది. 

నీరజ్ చోప్రా సాయంతో మంచు క్రీడలు, పర్వతారోహణ, బైకింగ్, సాహస క్రీడలకు మరింత ప్రాచుర్యం కల్పించాలన్నది స్విట్జర్లాండ్ ప్రణాళిక. టోక్యో ఒలింపిక్స్ అథ్లెటిక్స్ విభాగంలో స్వర్ణం గెలిచి చరిత్ర సృష్టించిన నీరజ్ చోప్రాకు స్విట్జర్లాండ్ తో ప్రత్యేక అనుబంధం ఉంది. 

జావెలిన్ లో అత్యుత్తమ శిక్షణ పొందేందుకు చోప్రా తరచుగా స్విట్జర్లాండ్ వస్తుంటాడు. ట్రైనింగ్ పూర్తయిన తర్వాత ఇంటర్ లాకెన్, జెర్మాట్, జెనీవా వంటి టూరిస్టు స్పాట్లను సందర్శిస్తుంటాడు. ఆ విధంగా నీరజ్ చోప్రాకు స్విట్జర్లాండ్ లోని దర్శనీయ పర్యాటక స్థలాలపై ఎంతో అవగాహన ఉంది. ఈ ఇండియన్ జావెలిన్ త్రోయర్ అనుభవాలు తమ పర్యాటక రంగం అభివృద్ధికి దోహదపడతాయని స్విస్ టూరిజం డిపార్ట్ మెంట్ భావిస్తోంది.


More Telugu News