కమ్మ సంఘం సమావేశాల్లో సీనియర్ అయిన వసంత నాగేశ్వరరావు వ్యాఖ్యలు సరికాదు: కొడాలి నాని

  • కమ్మ సామాజిక వర్గానికి అన్యాయం జరుగుతోందన్న నాగేశ్వరరావు 
  • ఒక్క కమ్మ మంత్రి కూడా లేడని విమర్శ  
  • ప్రాధాన్యతను బట్టే పదవులు అన్న నాని 
రాష్ట్రంలో కమ్మ సామాజిక వర్గానికి అన్యాయం జరుగుతోందని, రాష్ట్ర క్యాబినెట్ లో కమ్మ సామాజిక వర్గానికి చెందిన ఒక్క మంత్రి కూడా లేడని మాజీ మంత్రి వసంత నాగేశ్వరరావు వ్యాఖ్యానించారు. ఇతర సామాజిక వర్గాల పల్లకీలను ఇంకెన్నాళ్లు మోస్తారని అన్నారు. ఎన్టీఆర్ వర్సిటీ పేరు మార్చుతుంటే ఒక్కరూ అడ్డుకోలేదని విచారం వ్యక్తం చేశారు. కాకతీయ సేవాసమితి వన సమారాధన కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా వసంత నాగేశ్వరరావు ఈ వ్యాఖ్యలు చేశారు. 

దీనిపై వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నాని స్పందించారు. కమ్మ సంఘం నిర్వహించే సమావేశాల్లో వసంత నాగేశ్వరావు ఎంతో సీనియర్ అని, అలాంటి వ్యక్తి ఈ విధంగా వ్యాఖ్యానించడం సరికాదని హితవు పలికారు. కేవలం ఒక్క కమ్మ సామాజిక వర్గానికే పదవులు ఇవ్వలేదని అనడం సబబు కాదని, ప్రాధాన్యతను అనుసరించే ఏ వర్గానికైనా పదవులు లభిస్తాయని అభిప్రాయపడ్డారు. 

అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా సామాజికంగా, ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు పదవులు కేటాయించాల్సి ఉంటుందని తెలిపారు. కమ్మ సామాజిక వర్గం అన్ని రంగాల్లో ముందుందని అన్నారు. 

ఇక, ఎన్టీఆర్ ను ఒక్క కమ్మ సామాజిక వర్గానికే పరిమితం చేయరాదని అన్నారు. ఎన్టీఆర్ కు భారతరత్న తీసుకురావడంలో విఫలమైన చంద్రబాబును ఎందుకు అడగరని కొడాలి నాని ప్రశ్నించారు. టీడీపీ హయాంలో ఎస్టీ, మైనారిటీ మంత్రులకు ఒక్క పదవి కూడా ఇవ్వలేదని ఆరోపించారు.


More Telugu News