ఇంకా చాలామందిపై ఐటీ దాడులు జరుగుతాయి: పల్లా రాజేశ్వర్ రెడ్డి

  • నేడు మంత్రి మల్లారెడ్డిపై ఐటీ దాడులు
  • ఎన్ని దాడులు చేసినా భయపడబోమన్న పల్లా
  • పార్టీ మారే ప్రసక్తేలేదని స్పష్టీకరణ 
  • బీజేపీకి ప్రజలే బుద్ధి చెబుతారని వ్యాఖ్యలు
గత కొంతకాలంగా తెలంగాణలో టీఆర్ఎస్ నేతలపై ఈడీ, ఐటీ దాడులు జరుగుతుండడం తెలిసిందే. నేడు మంత్రి మల్లారెడ్డి నివాసం, కార్యాలయాలు, ఆయన బంధువుల ఇళ్లపైనా ఐటీ దాడులు జరిగాయి. ఈ నేపథ్యంలో, టీఆర్ఎస్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి స్పందించారు. 

ఆయన మీడియాతో మాట్లాడుతూ, కేంద్ర సంస్థలను రాజకీయమయం చేస్తున్నారని, దర్యాప్తు సంస్థల సిబ్బందిని వారి కార్యకర్తల్లా ఉపయోగించుకుంటున్నారని బీజేపీపై మండిపడ్డారు. దేశంలో 4 వేలమందిపై ఐటీ, ఈడీ, సీబీఐ దాడులు జరిగితే, వారిలో 3,900 మంది బీజేపీలో చేరారని రాజేశ్వర్ రెడ్డి వెల్లడించారు. ఒకప్పుడు అవినీతి, అక్రమాల ఆరోపణలు ఎదుర్కొన్న వారు ఇప్పుడు బీజేపీలో చేరగానే నీతిమంతులు అయిపోతారా? అని ప్రశ్నించారు. 

ఇలాంటి దాడులు మరిన్ని జరుగుతాయని భావిస్తున్నామని, కానీ తెలంగాణ మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఇలాంటి దాడులకు భయపడబోరని పల్లా రాజేశ్వర్ రెడ్డి స్పష్టం చేశారు. 'ఏ రైడ్ చేసుకుంటారో చేసుకోండి... ఏ కేసు పెట్టుకుంటారో పెట్టుకోండి... ప్రజలు గమనిస్తున్నారు... మీకు ఏ విధంగా బుద్ధి చెప్పాలో వారికి తెలుసు' అని వ్యాఖ్యానించారు. దాడులకు భయపడి ఇతర పార్టీల్లో చేరే ప్రసక్తేలేదని తేల్చి చెప్పారు. 

ఇప్పటికే గంగుల కమలాకర్, తలసాని శ్రీనివాస్ యాదవ్ పై దాడులు జరిగాయని, ఇవాళ మల్లారెడ్డి మీద దాడి జరుగుతోందని అన్నారు. తాము తెలంగాణ బిడ్డలం అని, తెలంగాణ కోసం ఉద్యమం చేసి జైలుకు కూడా వెళ్లొచ్చినవాళ్లు రాష్ట్రంలో ఉన్నారని, అదే స్ఫూర్తితో ఈ దాడులపైనా పోరాడతామని రాజేశ్వర్ రెడ్డి ఉద్ఘాటించారు.


More Telugu News