ట్విట్టర్ లో మిగిలింది.. ఇక 2750 మంది ఉద్యోగులు మాత్రమే!

  • ఎలాన్ మస్క్ రాక ముందు 7,500 మంది ఉద్యోగులు
  • ఇక మీదట తొలగింపులు ఉండవన్న సంకేతం
  • కొత్తగా ఇంజనీర్లను తీసుకుంటున్నట్టు ప్రకటన
ట్విట్టర్ లోకి ఎలాన్ మస్క్ ప్రవేశించిన నాటి నుంచి, అవసరం లేని, ఫలితాలు చూపించని ఉద్యోగులను తొలగించడం అనే ఏకైక లక్ష్యంతో పనిచేస్తున్నారు. దీంతో మస్క్ రాక ముందు ట్విట్టర్ లో మొత్తం 7,500 మందికి పైనే పనిచేస్తుంటే.. ప్రస్తుతం వారి సంఖ్య 2,750కు తగ్గిపోయినట్టు సంస్థ అంతర్గత వర్గాల సమాచారం. అంటే 4,750 మందిని ఆయన తీసేసినట్టయింది. కొంత మందిని నేరుగా తీసేయగా.. కొంత మంది వారంతట వారే సంస్థ నుంచి వెళ్లిపోయేలా చేయడంలో మస్క్ సక్సెస్ అయ్యారు.

ఇక మీదట తాను ఉద్యోగులను తొలగించబోనంటూ ఎలాన్ మస్క్ తాజాగా ప్రకటించారు. ఉద్యోగుల తొలగింపు పూర్తయిందంటూ.. కొత్తగా ఇంజనీర్లు, సేల్స్ విభాగంలో ఉద్యోగులను నియమించుకుంటున్నామని, రిఫరల్స్ ఉంటే చెప్పాలని మస్క్ ట్విట్టర్ ఉద్యోగులను కోరినట్టు సమాచారం. సాఫ్ట్ వేర్ ప్రొగ్రామ్ లో కోడ్స్ ను గొప్పగా రాసే వారికి ఎక్కువ ప్రాధాన్యం ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. ట్విట్టర్ ప్రధాన కార్యాలయాన్ని శాన్ ఫ్రాన్సిస్కో నుంచి టెక్సాస్ కు తరలించే ఆలోచనేదీ లేదన్నారు. అక్టోబర్ 27న ఎలాన్ మస్క్ ట్విట్టర్ ను స్వాధీనం చేసుకోవడం తెలిసిందే.


More Telugu News