నీళ్లు ఎక్కువగా తాగడమే బ్రూస్ లీ ప్రాణం తీసిందట.. తాజా పరిశోధనలో వెల్లడి! స్పెయిన్ సైంటిస్టుల అధ్యయనంలో వెల్లడి

  • శరీరంలో ద్రవాల అసమతౌల్యతకు కారణమైందని వివరణ
  • సోడియం స్థాయులు తగ్గిపోవడంతో కణజాలం వాపునకు గురైందని వెల్లడి
  • గతంలో కిడ్నీ సమస్యలతో బ్రూస్ లీ బాధపడ్డారని గుర్తుచేసిన పరిశోధకులు
  • 32 ఏళ్ల వయసులోనే ప్రాణాలు కోల్పోయిన మార్షల్ ఆర్ట్స్ వీరుడు
మార్షల్ ఆర్ట్స్ అనగానే ఇప్పటికీ గుర్తొచ్చే పేరు బ్రూస్ లీ.. సినిమాల్లో మార్షల్ ఆర్ట్స్ ను పరిచయంచేసి, ప్రపంచవ్యాప్తంగా ఆయన పాప్యులారిటీని సంపాదించుకున్నాడు. బక్క పలచని శరీరంతో మెలికలు తిరుగుతూ సినిమాల్లో బ్రూస్ లీ చేసే స్టంట్లకు జనం ఫిదా అయ్యేవారు. కోట్లాది అభిమానులను సంపాదించుకున్న బ్రూస్ లీ అర్థాంతరంగా, 32 ఏళ్ల వయసులోనే ఈ లోకాన్ని వదిలివెళ్లిపోయాడు. 

1973 జులైలో మెదడులో కణాలు ఉబ్బడం వల్ల బ్రూస్ లీ చనిపోయారు. అయితే, ఈ నటుడి మరణానికి మరో కారణం ఉందంటూ స్పెయిన్ సైంటిస్టులు తాజాగా వెల్లడించారు. నీళ్లు ఎక్కువగా తాగడం వల్లే బ్రూస్ లీ చనిపోయారని చెబుతున్నారు. చాలా అంశాలను, ఆయన అలవాట్లను చాలాకాలం పరిశీలించిన తర్వాతే తమకీ విషయం తెలిసిందని పేర్కొన్నారు.

బ్రూస్ లీ మరణానికి వైద్యులు చెబుతున్న కారణం.. మెదడులో కణాల వాపు. ఇక్కడి వరకు కరెక్టేనని, ఆ కణాల వాపునకు కారణం నీళ్లు ఎక్కువగా తాగడమేనని స్పెయిన్ సైంటిస్టులు పేర్కొన్నారు. బ్రూస్ లీ శరీరంలో అధికంగా చేరిన నీటిని బయటకు పంపడంలో ఆయన కిడ్నీలు విఫలమయ్యాయని తెలిపారు. దీంతో లీ శరీరంలో ద్రవాలు ఎక్కువైపోయి, సోడియం స్థాయులు పడిపోయాయని వివరించారు. 

దీని ఫలితంగానే మెదడులో కణాలు వాపునకు గురయ్యాయని, అదే ఆయన మరణానికి దారితీసిందని తెలిపారు. శరీరంలో ద్రవాల స్థాయులు ఎక్కువయ్యే పరిస్థితిని హైపోనాట్రామియా గా వ్యవహరిస్తారని వివరించారు. దీనివల్ల శరీరంలోపల సోడియం స్థాయులు పడిపోయి, కణజాలం వాపునకు గురవుతుందని పేర్కొన్నారు. 

కిడ్నీ సంబంధిత అనారోగ్యంతో బ్రూస్ లీ బాధపడుతూ ఉండొచ్చని స్పెయిన్ పరిశోధకులు అనుమానం వ్యక్తం చేశారు. దీంతో నీళ్లు ఎక్కువగా తాగడం, ద్రవాహారం తీసుకోవడంతో శరీరంలో ద్రవాల సమతౌల్యత దెబ్బతిందని వివరించారు. ఈ పరిశోధనా పత్రాన్ని క్లినికల్ కిడ్నీ జర్నల్ తన తాజా సంచికలో ప్రచురించింది.


More Telugu News