మోదీ సమక్షంలో ‘బీజేపీ’పై చిన్నారి అనర్గళ ప్రసంగం

  • బీజేపీ బీజేపీ బీజేపీ.. ఎక్కడ చూసినా బీజేపీయేనంటూ వ్యాఖ్యానం
  • బీజేపీ తిరిగి అధికారంలోకి రావాలని పిలుపు
  • బీజేపీని ఓడించడానికి ఎన్నోఆటలు ఆడుతున్నారని విమర్శ
ఓ చిన్నారి గుజరాతీ భాషలో ప్రధాని మోదీ ముందు ఎంత మాత్రం సంకోచం, భయం లేకుండా చక్కని పద్యం చదివి వినిపించింది. దీనికి ప్రధాని ఎంతో సంతోషపడ్డారు. తన భుజాలపై బీజేపీ కండువాను కప్పుకోవడమే కాకుండా, బీజేపీని అభినందిస్తూ, బీజేపీ గురించి ప్రచారం కూడా చేసింది. ఈ వీడియోను బీజేపీ ట్విట్టర్ లో షేర్ చేసింది. 

‘బీజేపీ మనల్ని కాపాడుతుంది. బీజేపీ మళ్లీ అధికారంలోకి రావాలి’ అని చిన్నారి ఆద్య కోరింది. పద్యం చదువుతున్న సమయంలో కొంచెం భయపడ్డావా? అని అడగ్గా.. ‘‘గదిలోకి వస్తున్న సమయంలో కొంచెం భయపడ్డా. ప్రధాని ముందుకు వెళ్లానో లేదో నాలో భయం పోయింది. ఎందుకంటే ఆయన్ను మా తాత అని అనుకున్నాను’’ అని చిన్నారి ఆద్య చెప్పింది.

ప్రధాని తనను ఆటోగ్రాఫ్ కావాలా? ఫొటోగ్రాఫ్ కావాలా? అని అడిగారని.. తాను రెండూ కావాలని చెప్పినట్టు వెల్లడించింది. దీంతో చిన్నారి కప్పుకున్న బీజేపీ కండువాపై ప్రధాని ఆటోగ్రాఫ్ ఇచ్చారు. ఆమెతో కలసి ఫొటో దిగారు. చిన్నారి ఆద్య బీజేపీ గురించి ప్రసంగిస్తున్నంత సేపు ప్రధాని నవ్వుతూనే కనిపించారు. ఇప్పుడు ఈ వీడియో వైరల్ అవుతోంది.  

‘‘బీజేపీ, బీజేపీ, బీజేపీ మీరు ఎక్కడ చూసినా బీజేపీ అక్కడ కనిపిస్తుంది. ప్రతి చర్చ కూడా బీజేపీతో మొదలై, బీజేపీతో ముగుస్తుంది. బీజేపీని ఓడించడానికి కొందరు ఎన్నో ఆటలు ఆడుతున్నారు’’ అంటూ బాలిక చెప్పడం గమనార్హం. దీనిపై కాంగ్రెస్ పార్టీ విమర్శలు కురిపించింది. ఎన్నికల ప్రచారానికి చిన్నారిని ఉపయోగించుకోవడంపై అభ్యంతరం వ్యక్తం చేసింది. దీనిపై చర్యలు తీసుకోవాలని ఎన్నికల సంఘాన్ని, జాతీయ బాలల హక్కుల కమిషన్ ను డిమాండ్ చేసింది.


More Telugu News