సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో విధ్వంసం కేసు.. మరో ఆరుగురి అరెస్ట్

  • అగ్నిపథ్ పథకానికి వ్యతిరేకంగా నిరసన
  • సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో నిరసనకారుల విధ్వంసం
  • ఇప్పటి వరకు 66 మంది అరెస్ట్
  • తాజాగా వరంగల్, వికారాబాద్, కర్నూలు, మహబూబ్‌నగర్, మహబూబాబాద్‌కు చెందిన నిందితుల అరెస్ట్
కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన అగ్నిపథ్ పథకానికి వ్యతిరేకంగా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో ఈ ఏడాది జూన్ 17న జరిగిన విధ్వంసకాండకు సంబంధించిన కేసులో తాజాగా మరో ఆరుగురు నిందితులను రైల్వే పోలీసులు అరెస్ట్ చేశారు. అజ్ఞాతంలో ఉన్న మరికొందరి కోసం గాలిస్తున్నారు. పెద్ద ఎత్తున రైల్వే స్టేషన్‌లోకి దూసుకొచ్చిన వందలాదిమంది నిరసనకారులు రైల్వే ఆస్తులకు నష్టం కలిగించారు. వారిని నియంత్రించేందుకు పోలీసులు జరిపిన కాల్పుల్లో ఓ యువకుడు మరణించగా, పదిమంది గాయపడ్డారు. 

ఈ ఘటనపై దర్యాప్తు కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (సిట్) ఏర్పాటు చేసింది. ఈ ఘటనకు సంబంధించి మొత్తం 81 మందిపై సికింద్రాబాద్ జీఆర్పీ పోలీసులు కేసులు నమోదు చేశారు. వీరిలో ఇప్పటి వరకు పలు దఫాలుగా 66 మందిని అరెస్ట్ చేశారు. తాజాగా, మరో ఆరుగురిని అరెస్ట్ చేశారు. వీరిలో వికారాబాద్, వరంగల్, మహబూబాబాద్, మహబూబ్‌నగర్, కర్నూలుకు చెందిన వారు ఉన్నారు. కాగా, ఇప్పటికే అరెస్ట్ అయిన వారు బెయిలుపై బయటకొచ్చారు.


More Telugu News