ఇవే చివరి ఎన్నికలు అని చంద్రబాబు ప్రజలను బెదిరిస్తున్నారు: సీఎం జగన్

  • నరసాపురంలో సీఎం జగన్ పర్యటన
  • ఆక్వా వర్సిటీకి శంకుస్థాపన
  • చంద్రబాబులో భయం కనిపిస్తోందన్న సీఎం జగన్
  • ప్రజలు ఇదేం ఖర్మరా బాబూ అనుకుంటున్నారని వెల్లడి 
పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురలో ఏపీ సీఎం జగన్ నేడు ఆక్వా యూనివర్సిటీకి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆయన ప్రసంగిస్తూ టీడీపీ అధినేత చంద్రబాబుపై విమర్శనాస్త్రాలు సంధించారు. తాను రాజకీయాల్లో ఉండాలన్నా, మళ్లీ అసెంబ్లీకి వెళ్లాలన్నా ప్రజలు గెలిపిస్తే సరేసరి... లేకపోతే  ఇవే చివరి ఎన్నికలు అని చంద్రబాబు ప్రజలను బెదిరిస్తున్నారని విమర్శించారు. 

చివరికి తాను కుప్పంలో గెలవలేనన్న భయం చంద్రబాబులో కనిపిస్తోందని అన్నారు. చంద్రబాబు ప్రతి మాటలోనూ నిరాశ, నిస్పృహ కనిపిస్తున్నాయని తెలిపారు. గతంలో టీడీపీ పాలన చూసి జనం ఇదే ఖర్మరా బాబూ అనుకున్నారని, 1995లో వెన్నుపోటుకు గురైన ఎన్టీఆర్ కూడా ఇంట్లోనూ, పార్టీలోనూ చంద్రబాబుకు స్థానమిచ్చినందుకు ఇదేం ఖర్మరా బాబూ అనుకుని ఉంటాడని వ్యంగ్యంగా అన్నారు.  

టీడీపీని తెలుగు బూతుల పార్టీగా మార్చేశారని, అటు దత్తపుత్రుడి పార్టీని రౌడీసేనగా మార్చారని సీఎం జగన్ వ్యాఖ్యానించారు. ఇలాంటి నాయకులు ఉండడం చూసి ప్రజలు కూడా ఇదేం ఖర్మరా బాబూ అనుకుంటున్నారని తెలిపారు.


More Telugu News