హైదరాబాద్ లో రేసింగ్ పోటీల రద్దుపై నిర్వాహకుల కీలక ప్రకటన

  • ప్రాక్టీస్ సమయంలో ప్రమాదం జరిగిందని వెల్లడి
  • రేసులు వాయిదా వేసినట్టు ప్రకటన
  • చెన్నైలో రెండో, మూడో రౌండ్ పోటీలు
  • డిసెంబర్ 10,11న హైదరాబాదులోనే నాలుగో రౌండ్
భారత్ లో తొలిసారి అది కూడా హైదరాబాద్ వేదికగా నిర్వహించిన ఇండియన్‌‌ రేసింగ్‌‌ లీగ్‌‌ (ఐఆర్‌‌ఎల్‌‌) తొలి రౌండ్ పోటీలు నిరాశ పరిచాయి. శని, ఆదివారాల్లో ప్రధాన రేసుల్లో ఒక్కటి కూడా జరగలేదు. కేవలం ప్రాక్టీస్ తోనే సరిపెట్టారు. హుస్సేన్ సాగర్ ఒడ్డున నిర్మించిన దేశంలోనే మొదటిదైన స్ట్రీట్ సర్క్యూట్ ట్రాక్ పై వరుస ప్రమాదాలు జరగడంతో ఇండియన్ రేసింగ్ ప్రధాన పోటీలు నిర్వహించలేదు. రేసు విషయంలో నిర్వహణ లోపంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. 

కొత్త ట్రాక్‌‌పై డ్రైవర్లకు పట్టు దొరక్కపోవడంతో, ప్రాక్టీస్ లో మూడు కార్లు ప్రమాదానికి గురయ్యాయి. ట్రాక్‌‌పై 14వ మలుపు వద్ద చెన్నై టర్బో రైడర్స్, గోవా ఏసెస్‌‌ కార్లు ఢీకొనగా.. ఓ మహిళా రేసర్ గాయాలతో ఆసుపత్రి పాలైంది. దాంతో, ఐఆర్‌‌ఎల్‌‌ ప్రధాన రేసులను రద్దు చేయడం మినహా నిర్వాహకులకు మరో మార్గం లేకుండా పోయింది. అయితే, పోటీల విషయంలో ఆదివారం నిర్వాహకులు ఎలాంటి ప్రకటన చేయకపోవడంతో గందరగోళం నెలకొంది. 

ఇండియన్ రేసింగ్ లీగ్ యాజమాన్యం సోమవారం ఉదయం ట్విట్టర్ ద్వారా అధికారిక ప్రకటన చేసింది. ప్రాక్టీస్ సమయంలో కారుకు ప్రమాదం జరిగిందని తెలిపింది. ఫెడరేషన్‌‌ ఆఫ్‌‌ మోటార్‌‌ స్పోర్ట్స్‌‌ క్లబ్‌‌ ఆఫ్‌‌ ఇండియా (ఎఫ్‌‌ఎంఎస్‌‌సీఐ) టెక్నికల్‌‌ అధికారులు.. ఆరు ఫ్రాంచైజీలతో మాట్లాడి ముందు జాగ్రత్తగా పోటీలను వాయిదా వేసినట్టు తెలిపింది. కాగా,  ఐఆర్‌‌ ఎల్‌‌లో రెండో, మూడో రౌండ్‌‌ పోటీలు చెన్నైలో జరగనున్నాయి. చివరి రౌండ్‌‌ వచ్చే నెల 10, 11వ తేదీల్లో తిరిగి హైదరాబాద్‌‌లోనే షెడ్యూల్‌‌ చేశారు. ఇక, ఫిబ్రవరి 11వ తేదీన ఇదే ట్రాక్‌‌పై ఫార్ములా–ఇ రేస్ జరగనుంది.


More Telugu News