కాలుష్యంతో కళ్లకు హాని.. ఇలా జాగ్రత్తలు తీసుకోవాలి..!

  • కంటికి ఎన్నో రూపాల్లో కాలుష్యం ముప్పు
  • కంట్లో వాపు, దురదలు, ఇరిటేషన్ రావచ్చు
  • ఎరుపెక్కి, నీరు కారుతుంటే వైద్యులను సంప్రదించాలి
  • కంటికి సొంత వైద్యం పనికిరాదు
పెరిగిపోయిన వాయు కాలుష్యంతో కళ్లకు నష్టం కలుగుతుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. కేవలం బయటి కాలుష్యంతోనే హాని అనుకోవద్దు. ఇంటి లోపల ఉండే సహజ కాలుష్యంతోనూ నష్టం వాటిల్లుతుంది. కంజెక్టివైటిస్, గ్లకోమా, క్యాటరాక్ట్, మాక్యులర్ డీజనరేషన్ సమస్యలకు కాలుష్యం కూడా కారణమేనంటున్నారు నిపుణులు.

పొగ మంచు కళ్లకు ఎంతో హానిచేస్తుందని శంకర ఐ హాస్పిటల్ క్యాటరాక్ట్, కార్నియా వైద్య నిపుణుడు నీరజ్ షా అంటున్నారు. కళ్లు పొడిబారడం, దురదలు, ఎరుపెక్కడం, కంటి వెంట నీరు కారడం, కంటిపాప వాపు, చూపు మసకగా మారడం వంటి సమస్యలకు కాలుష్యం కారణమవుతుందని చెబుతున్నారు. 

దీర్ఘకాలం పాటు ఇలా కాలుష్యానికి లోను కావడం వల్ల కంటి చూపు దెబ్బతినే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. కార్నియా అన్నది కంట్లో ఎంతో సున్నితమైనది. పర్యావరణ కాలుష్యాల ప్రభావం దీనిపై ఉంటుందని తెలుసుకోవాలి. కార్బన్ డయాక్సైడ్, నైట్రోజన్ ఆక్సైడ్, పార్టిక్యులేట్ మ్యాటర్ (పీఎం 2.5, 10) కంట్లో ఇరిటేషన్, వాపునకు కారణమవుతాయి. 

కంటి రక్షణకు ఉపాయాలు
  • గాలిలో ఉండే ప్రమాదకర కాలుష్యాలు మన కంటిలోకి చేరకుండా ఉండేందుకు, కళ్లద్దాలు ధరించాలి. ఇంటి నుంచి బయటకు వస్తుంటే, కళ్లను పూర్తిగా కప్పేలా అద్దాలు పెట్టుకోవాలి.
  • చేతులను తరచూ శుభ్రం చేసుకుంటూ ఉండాలి. 
  • తరచుగా కళ్లను చేతులతో తాకడం చేయవద్దు
  • దురద వచ్చినా, కంట్లో ఏదైనా పడినా చేత్తో కళ్లను బలంగా రుద్దడం చేయకూడదు. దీనివల్ల కళ్లు పొడిబారి, చూపు దెబ్బతింటుంది.
  • కంట్లో ఎరుపు, దురద, మంటలు, వాపు, చూపు తగ్గడం, నీరు కారడం వీటిల్లో రెండు లేదా అంతకంటే ఎక్కువ సమస్యలు కనిపిస్తే కంటి వైద్యుడిని సంప్రదించాలి.
  • కంట్లో ఏదైనా సమస్య కనిపిస్తే సొంతంగా ఔషధ వినియోగం సరికాదు. సమస్య ఏంటన్నది గుర్తించడం ఎంతో అవసరం. 


More Telugu News