ట్విట్టర్ లోకి తిరిగి వచ్చే ఆసక్తి లేదు: డొనాల్డ్ ట్రంప్

  • ట్రూత్ సోషల్ మీడియా అద్భుతంగా పనిచేస్తోందన్న ట్రంప్
  • దానితోనే కొనసాగుతానని ప్రకటన
  • ఎలాన్ మస్క్ కు అభినందనలు
అమెరికా మాజీ అధ్యక్షుడైన డొనాల్డ్ ట్రంప్ ట్విట్టర్ ఖాతా తిరిగి తెరుచుకుంది. ట్విట్టర్ ను సొంతం చేసుకున్న ఎలాన్ మస్క్.. ట్రంప్ ఖాతాను పునరుద్ధరించారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాల అనంతరం అల్లర్లను ప్రోత్సహించారంటూ, గతేడాది ఆరంభంలో నిబంధనల ఉల్లంఘన కింద ట్రంప్ ఖాతాను ట్విట్టర్ నిలిపివేసింది. ట్విట్టర్ నిషేధంతో ట్రంప్ తాను సొంతంగా ట్రూత్ అనే సోషల్ మీడియా యాప్ ను తయారు చేసుకున్నారు. అప్పటి నుంచి ట్రూత్ సోషల్ మీడియా ద్వారానే తన అభిప్రాయాలను పంచుకుంటున్నారు.

ఈ క్రమంలో ట్విటర్ లోకి తిరిగి వచ్చేందుకు ట్రంప్ ఆసక్తిగా లేనట్టు చెప్పారు. రిపబ్లికన్ కొయిలిషన్ వార్షిక నాయకత్వ సమావేశాన్ని ఉద్దేశించి ట్రంప్ మాట్లాడారు. తిరిగి ట్విట్టర్ లోకి రావడానికి తనకు ఎలాంటి కారణం కనిపించడం లేదని ఆయన పేర్కొన్నారు. ట్రంప్ మీడియా అండ్ టెక్నాలజీ గ్రూప్ రూపొందించిన ట్రూత్ సోషల్ మీడియా అద్భుతంగా పనిచేస్తోందని, తాను దానికే పరిమితమవుతానని చెప్పారు. 

తనను ట్విట్టర్ లోకి  ఆహ్వానించినందుకు ఎలాన్ మస్క్ ను అభినందించారు. 2024లో తిరిగి వైట్ హౌస్ లోకి అడుగు పెట్టే ప్రణాళికతో ఉన్నట్టు చెప్పారు. ట్రంప్ ఖాతాను పునరుద్ధరించాలా? అంటూ అంతకుముందు ఎలాన్ మస్క్ ట్విట్టర్ పై పోల్ నిర్వహించగా, 51.8 శాతం మంది అనుకూలంగా ఓటేశారు. ట్విట్టర్ లో ట్రంప్ కు ఇప్పటికీ 8.7కోట్ల మంది ఫాలవోర్లు ఉండడాన్ని గమనించాలి. ఇంత పెద్ద సంఖ్యలో ఫాలోవర్లు ఉండడంతో, మస్క్ సైతం ఆయన ఖాతాను పునరుద్ధరించక తప్పలేదు.


More Telugu News