సావర్కర్‌ను విమర్శించి.. జోడో యాత్ర ఫలితాన్ని పోగొట్టుకున్నారు: రాహుల్‌పై సంజయ్ రౌత్ విమర్శలు

  • రాహుల్ ఇలాంటి వ్యాఖ్యలు చేస్తూ బీజేపీకి అవకాశం ఇస్తున్నారన్న సంజయ్ 
  • శివసేన మౌత్‌పీస్ సామ్నాలో వ్యాసం
  • ప్రజల భావోద్వేగాలకు సంబంధించిన అంశాలను రాహుల్ ఎందుకు కదిలిస్తున్నారని ప్రశ్న
వీర్ సావర్కర్‌పై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేసిన విమర్శలు మహారాష్ట్రలోని మహా వికాస్ అఘాడీ (ఎంవీఏ)లో లుకలుకలకు కారణమయ్యాయి. సావర్కర్‌పై రాహుల్ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా పరిగణించిన ఉద్దవ్ శివసేన ఎంవీఏ నుంచి బయటకు వచ్చేందుకు సిద్ధమైందన్న వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో శివసేన ఎంపీ సంజయ్ రౌత్ కీలక వ్యాఖ్యలు చేశారు. 

భారత్ జోడో యాత్ర ద్వారా రాహుల్ గాంధీ సంపాదించుకున్న కీర్తి అంతా బూడిదలో పోసిన పన్నీరు అయిపోయిందని అన్నారు. శివసేన మౌత్‌పీస్ సామ్నాలో రాసిన ఓ వ్యాసంలో ఆయనీ వ్యాఖ్యలు చేశారు. ప్రజల భావోద్వేగాలకు సంబంధించిన అంశాలను రాహుల్ ఎందుకు కదిలిస్తున్నారని, బీజేపీకి ఎందుకు అవకాశం ఇస్తున్నారని ప్రశ్నించారు. సావర్కర్‌ను విమర్శించడం భారత్ జోడో యాత్ర అజెండా కాదని అన్నారు. ఇలాంటి విమర్శలు చేస్తూ ‘భారత్ జోడో’ అంటే ఫలితం ఏం ఉంటుందని రౌత్ విమర్శించారు.


More Telugu News