హుస్సేన్ సాగర్ తీరంలో ఇండియన్ కార్ రేసింగ్... ఆసక్తిగా తిలకించిన కేటీఆర్

  • రయ్యిమని పరుగులు తీసిన ఫ్యూయల్ కార్లు
  • రేసింగ్ ఈవెంట్ కు హాజరైన కేటీఆర్, హిమాన్షు
  • రేసు జరుగుతున్న సమయంలో స్వల్ప అపశ్రుతి 
  • ఐమ్యాక్స్ వద్ద కుంగిన గ్యాలరీ
హైదరాబాదులోని హుస్సేన్ సాగర్ తీరంలో ఇండియన్ కార్ రేసింగ్ ప్రారంభమైంది. ఇక్కడ ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన రేస్ ట్రాక్ లో ఫ్యూయల్ కార్లు రయ్యిమని పరుగులు తీశాయి. ఈ రేసింగ్ కోసం తెలంగాణ మంత్రి కేటీఆర్, ఆయన తనయుడు హిమాన్షు కూడా విచ్చేశారు. వారు ఎంతో ఆసక్తిగా రేసును తిలకించారు. 

కాగా, రేసు జరుగుతున్న సమయంలో చిన్న అపశ్రుతి చోటుచేసుకుంది. ఐమ్యాక్స్ పక్కన ఏర్పాటు చేసిన గ్యాలరీ కుంగిపోయింది. ఆ సమయంలో కేటీఆర్, హిమాన్షు అక్కడే ఉన్నారు. ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. 

ఈ ఇండియన్ కార్ రేసింగ్ పై గత కొన్నిరోజులుగా ప్రచారం చేస్తుండడంతో, నేడు భారీగా జనాలు తరలివచ్చారు.

ఇక్కడ మధ్యాహ్నం 3.10 గంటల నుంచి 3.20 గంటల వరకు తొలి క్వాలిఫైయింగ్ రౌండ్ నిర్వహించారు. మధ్యాహ్నం 3.30 గంటల నుంచి 3.40 గంటల వరకు రెండో క్వాలిఫైయింగ్ రౌండ్ నిర్వహించారు. ఈ రెండు రౌండ్లలో మెరుగైన టైమింగ్ సాధించిన అర్హులతో సాయంత్రం 4 గంటల నుంచి 4.45 గంటల వరకు మెయిన్ రేస్ నిర్వహించారు. 

ఈ రేసులో 24 మంది ప్రముఖ రేసర్లు పాల్గొన్నారు. వీరు 6 ప్రధాన నగరాల తరఫున పోటీ పడ్డారు. వచ్చే ఏడాది ఫిబ్రవరి 11న హైదరాబాదులో ఫార్ములా-ఈ కార్ రేసింగ్ జరగనుండగా, ఆ పోటీలకు ట్రయల్ రన్ గా నేడు ఇండియన్ రేసింగ్ సర్క్యూట్ పోటీలు చేపట్టారు.


More Telugu News