టీడీపీకి 160 కంటే ఎక్కువ సీట్లు వస్తాయి: అచ్చెన్నాయుడు

  • ఎంతకైనా తెగించేందుకు కార్యకర్తలు సిద్ధంగా ఉన్నారన్న అచ్చెన్న 
  • జగన్ పాలనకు ఇవే చివరి ఎన్నికలని కామెంట్ 
  • అన్ని వ్యవస్థలను జగన్ నాశనం చేశారని విమర్శ 

తెలుగుదేశం పార్టీ కోసం ఎంతకైనా తెగించేందుకు కార్యకర్తలందరూ సిద్ధంగా ఉన్నారని, అయితే నేతలే సిద్ధంగా లేరని ఆ పార్టీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు అన్నారు. నాయకులు  కూడా రోడ్డెక్కడానికి సిద్ధంగా ఉండాలని చెప్పారు. అందరూ కలిసి పనిచేస్తే టీడీపీకి 160 కంటే ఎక్కువ సీట్లే వస్తాయని అన్నారు. టీడీపీ గెలవడం ఖాయమని... అయితే గెలుస్తామనే ధీమాతో ఉండొద్దని చెప్పారు.

 ఇవే తన చివరి ఎన్నికలని చంద్రబాబు చెపితే కొందరు పిచ్చి కుక్కల్లా మాట్లాడారని... అవును చివరి ఎన్నికలే... జగన్ దుర్మార్గపు పాలన నుంచి విముక్తి కలిగించడానికి ఇవే చివరి ఎన్నికలని అన్నారు. 

ఒక్క ఛాన్స్ అంటూ అధికారంలోకి వచ్చి జనాల మధ్య తగాదా పెట్టారని విమర్శించారు. ఇకపై ప్రతి మూడు నెలలకు విస్తృతస్థాయి సమావేశాన్ని నిర్వహిస్తామని చెప్పారు. మూడున్నరేళ్లలో 36 మంది టీడీపీ కార్యకర్తలను కోల్పోయామని తెలిపారు. రాష్ట్రంలో ఎంతో మంది ప్రాణాలు కోల్పోతే పట్టించుకోని పోలీసులు... సీఎం కటౌట్ తగులబడిన వెంటనే డాగ్ స్క్వాడ్ ను రంగంలోకి దించారని విమర్శించారు. పోలీసులు ఏ స్థాయికి దిగజారిపోయారో అర్థమవుతోందని చెప్పారు. 

ఏపీకి జగన్ ఐరల్ లెగ్ అని... అన్ని వ్యవస్థలను నాశనం చేశారని దుయ్యబట్టారు. చంద్రబాబు పర్యటనల్లో రాళ్లు వేస్తున్నారని... ఇకపై తాము పోలీసులకు ఫిర్యాదు చేయబోమని, అదే ప్లేసులో వైసీపీ వాళ్లకు బుద్ధి చెపుతామని అన్నారు.


More Telugu News