టాలీవుడ్ వర్సెస్ కోలీవుడ్.. ముదురుతున్న వివాదం!
- విజయ్ హీరోగా దిల్ రాజు చిత్రం
- సంక్రాంతికి తమిళ డబ్బింగ్ సినిమాలను విడుదల చేయొద్దన్న తెలుగు నిర్మాతల మండలి
- ఇలాగైతే తెలుగు చిత్రాలను తాము కూడా అడ్డుకుంటామన్న తమిళ దర్శకనిర్మాతలు
'వారసుడు' సినిమా టాలీవుడ్, కోలీవుడ్ మధ్య చిచ్చు రేపుతోంది. తమిళ స్టార్ విజయ్ తో ఈ చిత్రాన్ని దిల్ రాజు నిర్మిస్తున్నారు. వంశీ పైడిపల్లి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రం తెలుగులో 'వారసుడు'గా, తమిళంలో 'వారిసు'గా వస్తోంది. సంక్రాంతి సందర్భంగా ఈ సినిమా విడుదల కాబోతోంది. అయితే సంక్రాంతికి తెలుగు సినిమాలకు మాత్రమే ప్రాధాన్యతను ఇవ్వాలని... డబ్బింగ్ సినిమాలను విడుదల చేయవద్దని తెలుగు సినీ నిర్మాతల మండలి లేఖను విడుదల చేసింది. ఈ లేఖపై తమిళ సినీ దర్శకనిర్మాతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
తమిళనాడులో తెలుగు సినిమాలు ఎలాంటి ఆటంకాలు లేకుండా విడుదల అవుతున్నాయని... అలాంటప్పుడు తెలుగు రాష్ట్రాల్లో తమిళ చిత్రాలను ఆపడం ఏమిటని ప్రశ్నించారు. ఇలాగైతే తాము కూడా తెలుగు సినిమాలను అడ్డుకుంటామని అన్నారు. తమిళ దర్శకుడు సీమాన్ మాట్లాడుతూ... వారసుడు సినిమా దర్శకుడు, నిర్మాత ఇద్దరూ తెలుగువారేనని, హీరో మాత్రమే తమిళ నటుడని అన్నారు. ఇంత జరుగుతున్నా సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఛాంబర్ ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు.