రేపటి నుంచి మూడు రోజుల పాటు ఆంధ్రప్రదేశ్ లో వర్షాలు

  • బంగాళాఖాతంలో అల్పపీడనం ఎఫెక్ట్
  • తమిళనాడు, పుదుచ్చేరికీ వర్ష సూచన
  • సముద్రంలో వేటకు వెళ్లొద్దంటూ వాతవరణ శాఖ హెచ్చరిక
ఆంధ్రప్రదేశ్ లో ఆదివారం నుంచి వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం.. వాయుగుండంగా మారే అవకాశం ఉందని పేర్కొంది. దీని ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. అల్పపీడన ద్రోణి ప్రభావంతో తమిళనాడు, పుదుచ్చేరిలలోనూ పలుచోట్ల వర్షాలు కురుస్తాయని వివరించింది.

దక్షిణ కోస్తా, రాయలసీమలలో ఈ నెల 20, 21 తేదీలలో కొన్నిచోట్ల ఉరుములు, మెరుపులతో వర్షాలు పడతాయని వాతావరణ శాఖ సూచించింది. అల్పపీడన ద్రోణి ప్రభావంతో గంటకు 40 నుంచి 55 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని హెచ్చరించింది. సముద్రంలో వేటకు వెళ్లొద్దంటూ మత్స్యకారులను హెచ్చరించింది.

మరోవైపు, తెలుగు రాష్ట్రాలను చలి వణికిస్తోంది. రెండు రోజులుగా ఉష్ణోగ్రతలు సాధారణంకంటే ఐదు డిగ్రీలు తక్కువగా నమోదవుతున్నాయి. శుక్రవారం ఆంధ్రప్రదేశ్ లోని చింతపల్లిలో 9.4 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కాగా.. తెలంగాణలోని సిర్పూర్ గ్రామంలో 9.8 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. పాడేరు, అరకు తదితర ఏజెన్సీ ప్రాంతాలలో చలిగాలులకు మన్యం వాసులు వణికిపోతున్నారు. మరో రెండు రోజుల పాటు చలి తీవ్రత పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.


More Telugu News