ఇయర్ బడ్స్.. చెవులకు చేటు!

  • గంటల కొద్దీ శబ్దాలకు ఎక్స్ పోజ్ కావడం హానికరం
  • 75-80 డెసిబుల్స్ కంటే ఎక్కువ తీవ్రత ఉండకూడదు
  • 100 కోట్ల మందికి వినికిడి శక్తి దెబ్బతినే రిస్క్
ఇయర్ బడ్స్ నేడు ఎంతో ఉపయోగకరంగా, సౌకర్యంగా మారాయి. ముఖ్యంగా వైర్ లెస్, టీ డబ్ల్యూ ఎస్ ఇయర్ బడ్స్ ఎన్నో ఫీచర్లతో కాంపాక్ట్ సైజుతో వస్తున్నాయి. దీంతో వీటిని వినియోగించే వారి సంఖ్య పెరుగుతోంది. ఈ తరుణంలో ఇయర్ బడ్స్ యూజర్లను అప్రమత్తం చేసే విధంగా తాజా అధ్యయనం ఫలితాలు వెలువడ్డాయి. 

యాపిల్ ఎయిర్ పాడ్స్ మొదలు కొని, నథింగ్ ఇయర్ స్టిక్, ఒప్పో, రియల్ మీ బడ్స్ వరకు మార్కెట్లో ఎన్నో రకాల మోడల్స్ ఇయర్ బడ్స్, బ్లూటూత్ హెడ్ సెట్స్ అమ్ముడవుతున్నాయి. అంతేకాదు మన దేశంలో వీటి విక్రయాలు ఏటేటా 75 శాతానికి పైగా పెరుగుతున్నాయి. బీఎంజీ గ్లోబల్ హెల్త్ లో ప్రచురితమైన ఓ అధ్యయనం ఫలితాలను గమనిస్తే.. హెడ్ ఫోన్లు, ఇయర్ బడ్స్ ను అధికంగా ఉపయోగించడం కారణంగా 100 కోట్ల మంది టీనేజర్లు వినికిడి శక్తిని కోల్పోయే ప్రమాదం ఉందని తెలుస్తోంది. 

మెడికల్ యూనివర్సిటీ ఆఫ్ సౌత్ కరోలినాకు చెందిన పరిశోధకులు ఈ అధ్యయనంలో పాల్గొన్నారు. వినికిడి శక్తిని కాపాడేందుకు ఇయర్ బడ్స్ విషయంలో కొన్ని నిబంధనలు తీసుకురావాలని ఈ అధ్యయనం సూచించింది. సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ సైతం.. చిన్నారులు, కౌమారదశలోని (6-12) 52 లక్షల మంది, 20-69 వయసులోని 2.6 కోట్ల మంది శబ్దాలకు ఎక్కువ ఎక్స్ పోజ్ కావడం వల్ల శాశ్వత వినికిడిని కోల్పోయే ముప్పును ఎదుర్కొంటున్నట్టు తెలిపింది. 

ముఖ్యంగా యువతరం.. స్మార్ట్ ఫోన్లు, హెడ్ ఫోన్లు, ఇయర్ బడ్స్ తో కాల్స్ ఎక్కువ సమయం మాట్లాడడం, గంటల కొద్దీ వీడియోలు, ఆడియోలతో కాలక్షేపం చేయడం వారికి ముప్పును తెచ్చి పెడుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. పెద్దలు అయితే 80 డెసిబుల్స్ వరకు, చిన్నారులు 75 డెసిబుల్స్ కు మించి శబ్ద తీవ్రత లేకుండా వినాలని సూచిస్తున్నారు. కానీ, ఎక్కువ మంది 105 డెసిబుల్స్ తీవ్రతతో ఇయర్ బడ్స్ ద్వారా శబ్దాన్ని వింటున్నారు.


More Telugu News