పోలాండ్ ఫుట్ బాల్ ఆటగాళ్ల విమానానికి యుద్ధ విమానాలతో ఎస్కార్ట్.. వీడియో ఇదిగో!

  • ఫిఫా వరల్డ్ కప్ కోసం ఖతార్ కు పోలాండ్ ఫుట్ బాల్ జట్టు
  • ఉక్రెయిన్-రష్యా యుద్ధం నేపథ్యంలో సెక్యూరిటీగా యుద్ధవిమానాలను పంపిన పోలాండ్
  • ఆకాశంలో తమకు తోడుగా వస్తున్న విమానాలను వీడియో తీసిన ఆటగాళ్లు
  • సోషల్ మీడియాలో వీడియో పోస్ట్ చేసి పైలట్లకు థ్యాంక్స్ చెప్పిన వైనం
క్రికెటర్లకు, సినిమా స్టార్లకు, ఫుట్ బాల్ ప్లేయర్లకు పోలీసులు నిరంతరం సెక్యూరిటీ కల్పించడం సాధారణమే.. పోలాండ్ మాత్రం తమ దేశ ఆటగాళ్లు ప్రయాణించే విమానానికి సెక్యూరిటీగా మరో రెండు విమానాలను పంపించింది. ఏకంగా రెండు యుద్ధ విమానాలతో ఎస్కార్ట్ కల్పించింది. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం జరుగుతుండడం, ఆ రెండు దేశాలు తమ పక్కనే ఉండడంతో ముందుజాగ్రత్త చర్యగా ఈ నిర్ణయం తీసుకుంది.

ఖతార్ లో ఫిఫా వరల్డ్ కప్ పోటీలు జరుగుతున్న విషయం తెలిసిందే! ఈ పోటీలలో పోలాండ్ ఫుట్ బాల్ టీమ్ కూడా పాల్గొంటోంది. అయితే, ఖతార్ వెళ్లాలంటే రష్యా, ఉక్రెయిన్ దేశాల గగనతలం నుంచి విమానం ప్రయాణం చేయాల్సి ఉంటుంది. ఆ రెండు దేశాల మధ్య తీవ్ర యుద్ధం జరుగుతున్న క్రమంలో తమ విమానంపై క్షిపణి దాడి జరిగే ప్రమాదం ఉందని పోలాండ్ ఆటగాళ్లు ఆందోళన వ్యక్తం చేశారు.

ఉక్రెయిన్ సరిహద్దుల్లోని పోలాండ్ గ్రామంలో ఇటీవల క్షిపణి పడిన నేపథ్యంలో ఆటగాళ్లతో పాటు వాళ్ల అభిమానులు కూడా ఆందోళన చెందుతున్నారు. దీంతో పోలాండ్ ఫుట్ బాల్ టీమ్ ప్రయాణించే విమానానికి ఎఫ్-16 యుద్ధ విమానాలను పోలాండ్ ప్రభుత్వం ఎస్కార్ట్ గా పంపించింది. ఆకాశంలో తమ విమానానికి తోడుగా వస్తున్న యుద్ధ విమానాలను ఆటగాళ్లు వీడియో తీశారు. ఆ వీడియోను సోషల్ మీడియాలో పెట్టి, యుద్ధ విమానాల పైలట్లకు కృతజ్ఞతలు తెలిపారు. ఆ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.


More Telugu News