ద్రవిడ్‌కు అండగా అశ్విన్.. రవిశాస్త్రి వ్యాఖ్యలకు కౌంటర్
- ఐపీఎల్ సమయంలో తీసుకునే రెండు, మూడునెలల విశ్రాంతే కోచ్‌కు ఎక్కువన్న రవిశాస్త్రి
- టీ20 ప్రపంచకప్ సమయంలో ద్రవిడ్ సారథ్యంలోని కోచింగ్ స్టాఫ్ బాగా అలసిపోయిందన్న అశ్విన్
- కవీస్ పర్యటన ముగిసిన వెంటనే బంగ్లాదేశ్ పర్యటన ఉండడం వల్లేనన్న స్టార్ స్పిన్నర్
న్యూజిలాండ్ పర్యటన నుంచి బ్రేక్ తీసుకున్న టీమిండియా కోచ్ రాహుల్ ద్రవిడ్‌పై మాజీ కోచ్ రవిశాస్త్రి చేసిన విమర్శలకు స్టార్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ కౌంటరిచ్చాడు. న్యూజిలాండ్ పర్యటన నుంచి ద్రావిడ్ సారథ్యంలోని కోచింగ్ బృందానికి విశ్రాంతి కల్పించిన బీసీసీఐ ఆ బాధ్యతలను జాతీయ క్రికెట్ అకాడమీ హెడ్ వీవీఎస్ లక్ష్మణ్‌కు అప్పగించింది. అలాగే, రోహిత్ శర్మ సహా కొందరు సీనియర్లకు కూడా విశ్రాంతి ఇచ్చిన బీసీసీఐ టీ20 బాధ్యతలు హార్దిక్ పాండ్యాకు అప్పగించింది.
కివీస్ పర్యటనకు ద్రవిడ్ రెస్ట్ తీసుకోవడాన్ని టీమిండియా మాజీ కెప్టెన్, మాజీ కోచ్ రవిశాస్త్రి తీవ్రంగా తప్పుబట్టాడు. ఇప్పుడు విశ్రాంతి తీసుకోవాల్సినంత అవసరం ఏమొచ్చిందని ప్రశ్నించాడు. ఈ బ్రేక్స్‌పై తనకు నమ్మకం లేదని తేల్చి చెప్పాడు. తొలుత తన జట్టును, ఆటగాళ్లను అర్థం చేసుకోవాలని, ఆ తర్వాత తమ నియంత్రణలోకి తెచ్చుకోవాలని, అంతేకానీ, ఈ బ్రేకులెందుకని ప్రశ్నించాడు. ఐపీఎల్ సమయంలో తీసుకునే రెండు, మూడునెలల విశ్రాంతి సరిపోదా? అని నిలదీశాడు. నిజం చెప్పాలంటే ఆ సమయమే ఎక్కువన్నాడు. కోచ్ ఎవరైనా సరే ఇదే వర్తిస్తుందని పేర్కొన్నాడు.
రవి వ్యాఖ్యలకు టీమిండియా స్టార్ స్పిన్నర్ అశ్విన్ స్పందించాడు. ద్రావిడ్‌కు అండగా నిలిచాడు. టీ20 ప్రపంచకప్ సమయంలో కోచింగ్ సిబ్బంది చాలా శ్రమించిందని, శారీరకంగా, మానసికంగా అలసిపోయిందని అన్నాడు. కాబట్టి బ్రేక్ అవసరమేనని స్పష్టం చేశాడు. కోచింగ్ స్టాఫ్ ఎంత కష్టపడిందో తాను దగ్గరుండి చూశానని పేర్కొన్నాడు. వారు మానసికంగానే కాకుండా శారీరకంగానూ తీవ్రంగా అలసిపోయి ఉంటారన్నాడు. న్యూజిలాండ్ పర్యటన ముగిసిన వెంటనే బంగ్లాదేశ్ పర్యటన ఉందని, కాబట్టే కివీస్ పర్యటనకు లక్ష్మణ్ సారథ్యంలోని కోచింగ్ స్టాఫ్‌ను పంపారని అశ్విన్ వివరించాడు.